ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్

12 May, 2016 20:07 IST|Sakshi
ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అధ్యక్షుడిగా ఉండాలని ఉన్నప్పటికీ ఐసీసీ చైర్మన్ పదవి కోసం రాజీనామా చేశానని శశాంక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రికెట్ బోర్డు గర్వించేలా చేస్తానని, ఇతర భాగస్వాములతో కలసి పనిచేసి క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని చైర్మన్ గా ఎన్నికయిన సందర్భంగా శశాంక్ పేర్కొన్నాడు. మంగళవారం నాడు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ గురువారం ఐసీసీ అత్యున్నత పదవిని చేపట్టాడు. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు.

ఐసీసీ డైరెక్టర్స్ ఒక అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తారు. ఆ క్యాండిడేట్ పేరును ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్లు బలపరచాలి. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికలకు గానూ శశాంక్ ఒక్కరి పేరు ప్రతిపాదించారు. చైర్మన్ ఎన్నికను ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ పర్యవేక్షించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికకు పాత పద్ధతికి చాలా మార్పులున్నాయి. గతంలో ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు అధ్యక్షులైనా ఐసీసీ చైర్మన్ బరిలో నిలిచే అవకాశం ఉండేది. దేశ క్రికెట్ బోర్డుతో సంబంధం లేదంటూ ఇండిపెండెంట్ గా ఈ బరిలో నిలిచి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచాడు.

మరిన్ని వార్తలు