పదవి నుంచి వైదొలిగిన శశాంక్‌ మనోహర్‌

1 Jul, 2020 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ వైదొలిగారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం వెల్లడించింది. శశాంక్‌ మనోహర్‌ వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు.. డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాజా చైర్మన్‌ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని మాట్లాడుతూ.. చైర్మన్‌గా తమను ముందుండి నడిపించిన శశాంక్‌ మనోహర్‌కు ఐసీసీ బోర్డు, సిబ్బంది, మొత్తం క్రికెట్‌ కుటుంబం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాన్నారు. మనోహర్‌ శశాంక్‌, ఆయన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అదే విధంగా డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాజా.. శశాంక్‌ సైతం మనోహర్‌పై ప్రశంసలు కురిపించారు. క్రికెట్‌ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అమోఘమని. ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. కాగా వారం రోజుల్లోగా శశాంక్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసీబీ మాజీ చైర్మన్‌ కోలిన్‌ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చైర్మన్‌గా శశాంక్‌ ఎన్నికైన నాటి నుంచి బీసీసీఐకి ఐసీసీతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.(శశాంక్‌ మనోహర్‌పై బీసీసీఐ ఆగ్రహం)

>
మరిన్ని వార్తలు