శాస్త్రికి మరో అవకాశం!

16 Aug, 2019 05:44 IST|Sakshi

నేడు భారత కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు

ముంబై: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక విషయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా!  ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రినే కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇతర ఐదుగురు అభ్యర్థులు సీఏసీని మెప్పించేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. భారత కోచ్‌ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రాబిన్‌ సింగ్, ఫిల్‌ సిమన్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కపిల్‌ దేవ్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు.  

కెప్టెన్‌ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం శాస్త్రికి అనుకూలంగా మారింది. అతని శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. శాస్త్రి కోచ్‌గా వచ్చిన సమయం (జులై 2017)నుంచి భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది. రెండు వన్డే వరల్డ్‌ కప్‌లలోనూ సెమీఫైనల్‌ దాటకపోయినా దానిని పెద్ద వైఫల్యంగా ఎవరూ చూ డటం లేదు. పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్‌కు మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. 

>
మరిన్ని వార్తలు