షఫాలీ చేజారిన టాప్‌ ర్యాంక్‌

10 Mar, 2020 01:20 IST|Sakshi

మూడో స్థానంలో భారత ఓపెనర్‌

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో వైఫల్యం భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. సోమవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో 16 ఏళ్ల షఫాలీ వర్మ టాప్‌ ర్యాంక్‌ నుంచి పడిపోయి 744 రేటింగ్‌ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టి20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక షఫాలీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్లో షఫాలీ కేవలం రెండు పరుగులు చేసి అవుటవ్వడంతో ఆమె ర్యాంక్‌ పడిపోయింది. ఫైనల్లో అజేయంగా 78 పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ బెథ్‌ మూనీ రెండు స్థానాలు పురోగతి సాధించి 762 ర్యాంకింగ్‌ పాయింట్లతో కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌ 750 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌కే చెందిన స్మృతి మంధాన ఏడో ర్యాంక్‌లో, జెమీమా రోడ్రిగ్స్‌ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్‌ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు