'టీ20వరల్డ్‌ కప్ టైమ్‌లో ఏం చేశారు?'

13 Apr, 2016 20:15 IST|Sakshi
'టీ20వరల్డ్‌ కప్ టైమ్‌లో ఏం చేశారు?'

న్యూఢిల్లీ: కరువు పీడిత మహారాష్ట్ర నుంచి 13 ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీసీఐని బిత్తరపోయేలా చేసింది. ప్రస్తుత పరిస్థితిలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించడం సమస్యే అయినప్పటికీ, బీసీసీఐ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్‌ శుక్లా తెలిపారు.

కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా చేయడంతోపాటు సీఎం రిలీఫ్‌ పండ్‌కు నిధులు ఇస్తామని బీసీసీఐ చెప్పినప్పటికీ, ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించొద్దంటూ హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో శుక్లా విలేకరులతో మాట్లాడుతూ 'ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ చాలా పెద్ద పని. ఇప్పుడు మ్యాచ్‌లు మార్చడం అంత సులభం కాదు. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఇప్పుడు మ్యాచుల తరలింపు అంటే సమస్యే. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను మేం గౌరవిస్తాం. మొత్తం 19 మ్యాచ్‌లలో 13ని మహారాష్ట్ర నుంచి తరలించాల్సి ఉంది. ఇందుకు మేం కష్టపడాలి' అని అన్నారు.

'మ్యాచ్‌లు తరలించాల్సి వస్తే.. ఎక్కడికి తరలించాలి? ఎలా తరలించాలి? అన్నది సమస్య. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇటీవల 24 మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు ఒక్కరూ కూడా ఈ అంశాన్ని (నీటి సమస్యను) లేవనెత్తలేదు.  గత ఆరు నెలల్లో ఎవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదు. మహారాష్ట్రలో ఎన్నో సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి ఎంతో నీటి అవసరముంది. అయినా ఆ అంశాన్ని ఎవరూ లేవనెత్తడం లేదు. అన్ని సమకూరుస్తామన్నా.. ఐపీఎల్‌ విషయంలోనే ఈ విషయాన్ని లేవనెత్తారు' అని శుక్లా పేర్కొన్నారు. ఐపీఎల్‌ ను లక్ష్యంగా చేసుకున్నారన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు