కేఎల్‌ రాహుల్‌తో పోటీపై ధావన్‌..

15 May, 2020 15:04 IST|Sakshi

సెలక్షన్‌ నా చేతుల్లో లేదు

కివీస్‌తో సిరీస్‌కు గాయంతో ధావన్‌ మిస్‌

ఓపెనర్‌గా సత్తాచాటిన రాహుల్‌

న్యూఢిల్లీ: గాయాలనేవి జీవితంలో ఒక భాగమని అంటున్నాడు టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌. గతేడాది కంటి గాయం, మోకాలి గాయం, భుజం గాయంతో  పాటు మెడ నొప్పితో పలు టోర్నీల్లో ఆడే అవకాశాన్ని ధావన్‌ కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు సైతం ధావన్‌ చివరి నిమిషంలో దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా ధావన్‌ దూరం కావడంతో అతని స్థానాన్ని రాహుల్‌ భర్తీ చేయడమే కాకుండా ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రాహుల్‌ 224 పరుగులు చేసి ఓపెనర్‌గా స్థానం పదిలం చేసుకున్నాడు. దాంతో ధావన్‌ స్థానం డైలమాలో పడింది. వికెట్‌ కీపర్‌గా రాణించి రిషభ్‌ పంత్‌ను ఏ విధంగా వెనక్కినెట్టేశాడో, ఓపెనర్‌గా కూడా రాణించి ధావన్‌ స్థానాన్ని సందిగ్థంలోకి నెట్టేశాడు రాహుల్‌. దీనిపై ఇర్ఫాన్‌ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో సమాధానమిచ్చిన ధావన్‌.. తన ఎంపిక గురించి ఎటువంటి ఆందోళన లేదన్నాడు. సెలక్షన్‌ అనేది తన చేతుల్లో లేనప్పుడు ఆలోచించడం వృథా అన్నాడు. మనం మంచి ప్రదర్శన ఇచ్చినప్పుడు స్థానం గురించి బెంగ ఉండదన్నాడు. కేవలం ఆడటం మాత్రమే తన చేతుల్లో ఉందని, సెలక్షన్‌ అనేది మాత్రం సెలక్టర్ల చేతుల్లో ఉంటుందన్నాడు. (భారీ నష్టం తప్పదు : సౌరవ్‌ గంగూలీ)

దాదాపు ఏడాది కాలం నుంచి తరుచు గాయాల బారిన పడటం కూడా తన ఆటపై ప్రభావం చూపిందన్నాడు. అయితే గాయాలనేవి ఆటలో భాగంగానే భావించాలన్నాడు. ‘అవును.. కేఎల్‌ రాహుల్‌ బాగా ఆడుతున్నాడు. రాహుల్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉండి నేను నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తా. శ్రీలంకతో సిరీస్‌ అతని బ్యాటింగ్‌ చూశా. రాహుల్‌ బ్యాటింగ్‌ వేరే స్థాయిలో ఉంది. రాహుల్‌ కచ్చితంగా చాలా బాగా ఆడుతున్నాడు. మైదానం నలువైపులా అలవోకగా అతను షాట్లు ఆడేస్తున్నాడు. రాహుల్‌ బ్యాటింగ్‌ను బాగా ఆస్వాదించా’ అని ధావన్ కొనియాడాడు. కాగా, వరల్డ్‌కప్‌లో స్థానమే లక్ష్యంగా సిద్ధం అవుతున్నట్లు ధావన్‌ తెలిపాడు.దీనికి సంబంధించి బాగా శ్రమిస్తున్నానని తెలిపాడు. అవకాశం దొరికితే  నిరూపించుకోవడమే  తన లక్ష్యమన్నాడు. తనకు జట్టులోకి రావడం, పోవడం పరిపాటిగా మారిపోయిందన్న ధావన్‌.. సెలక్షన్‌ అనేది మాత్రం తన పరిధిలో ఉండని అంశమన్నాడు. గతేడాది చివర్లో కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్పిన ధావన్‌.. తానొక క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయాన్ని స్పష్టం చేశాడు. గత డిసెంబర్‌లో తన ‌ రీఎంట్రీలో భాగంగా రాహుల్‌తో పోటీ గురించి మాట్లాడుతూ..  క్లాస్‌ అనేది ఎప్పటికీ శాశ్వతమన్నాడు.(‘ధోని.. మిస్టర్‌ కూల్‌ కాదు’)

మరిన్ని వార్తలు