శిఖర్‌ ధావన్‌పై వేటు 

30 Sep, 2018 00:07 IST|Sakshi

తొలిసారి మయాంక్‌ అగర్వాల్, సిరాజ్‌లకు చోటు

భువనేశ్వర్, బుమ్రా, ఇషాంత్‌ శర్మలకు విశ్రాంతి

విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లే జరిగింది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు టీమిండియాలో కొత్త ముఖాలకు చోటు దక్కింది. దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లకు జాతీయ టెస్టు జట్టులోకి తొలిసారి పిలుపు వచ్చింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మణికట్టు గాయం నుంచి కోలుకున్నట్లు స్పష్టత రావడంతో... విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు 15 మంది జట్టు సభ్యులను శనివారం రాత్రి సెలెక్టర్లు ప్రకటించారు. ఆసియా కప్‌లో విశేషంగా రాణించినప్పటికీ, అంతకుముందు ఇంగ్లండ్‌లో తీవ్రంగా విఫలమైన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై వేటు పడింది. ముంబై యువ సంచలనం పృథ్వీ షా, ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిలకు మరో అవకాశం దక్కింది. ఫిట్‌నెస్‌ సంతరించుకున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. మున్ముందు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రాలతో పాటు ఇషాంత్‌ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాల్గొన్న ఓపెనర్‌ మురళీ విజయ్, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ చోటు కోల్పోయారు. 

ప్రతిభకు గుర్తింపు... 
దేశవాళీతో పాటు భారత ‘ఎ’ జట్టు తరఫున టన్నులకొద్దీ పరుగులు సాధిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు దక్కింది. సమర్థుడైన ఓపెనర్‌ అయినప్పటికీ జట్టు పరిస్థితులరీత్యా అతడు ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే, ధావన్, విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో మయాంక్‌ ఎంపికకు అడ్డంకి లేకుండా పోయింది. తుది జట్టులో చోటు కోసం పృథ్వీ షాతో పోటీ ఉన్నా... అనుభవంరీత్యా అతడికే ముందుగా అవకాశం రావొచ్చు. అదే జరిగితే కర్ణాటక సహచరుడైన లోకేశ్‌ రాహుల్‌తో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇక, టీమిండియా తరఫున 3 టి20లు ఆడిన సిరాజ్‌ ఇటీవల భారత ‘ఎ’ జట్టు తరఫున అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కెరీర్‌లో తొలిసారి ఓ మ్యాచ్‌లో 10 వికెట్లు సైతం పడగొట్టాడు. దీంతో విండీస్‌తో సిరీస్‌కు ఎంపికవుతాడనే అంచనాలు పెరిగాయి. పదునైన పేస్‌తో బంతిని బలంగా పిచ్‌ చేసే సిరాజ్‌... ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఉపయోగపడతాడని సెలెక్టర్లు భావించినట్లున్నారు. దానికి సన్నాహకంగా విండీస్‌తో టెస్టులకు అవకాశమిచ్చారు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు అక్టోబరు 4 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది. 

భారత టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్‌ కెప్టెన్‌), పుజారా, లోకేశ్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్, పృథ్వీ షా, విహారి, రిషభ్‌ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, షమీ, ఉమేశ్‌ యాదవ్, సిరాజ్, శార్దుల్‌ ఠాకూర్‌.  

మరిన్ని వార్తలు