రోహిత్, రాహుల్‌పై దృష్టి

21 Jul, 2017 01:40 IST|Sakshi

శ్రీలంక ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో నేటి నుంచి భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌   

కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక పోరుతో భారత్‌ తమ సాధనకు పదును పెట్టనుంది. ఇక్కడి బీఆర్‌సీ గ్రౌండ్స్‌లో నేడు, రేపు జరిగే రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో తలపడుతుంది. రెండు రోజుల మ్యాచ్‌ కాబట్టి టీమిండియా ఒక రోజు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు, మరో రోజు బౌలింగ్‌ ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న పలువురు భారత ఆటగాళ్లకు ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కీలకం కానుంది. రాహుల్, రోహిత్, ఇషాంత్‌ శర్మ, షమీ ఈ మ్యాచ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తుది జట్టులో ఎవరూ పెద్దగా గుర్తింపు ఉన్న ఆటగాళ్లు లేరు.

వారిద్దరు ఓ అవకాశంగా భావించాలి: కోహ్లి
శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో శిఖర్‌ ధావన్, అభినవ్‌ ముకుంద్‌లలో ఎవరు ఓపెనింగ్‌ స్థానంలో బరిలోకి దిగినా ఒత్తిడిగా కాకుండా ఓ అవకాశంలా భావించాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కోరాడు. మరోవైపు శ్రీలంకను తామేమీ తక్కువ అంచనా వేయడం లేదని స్పష్టం చేశాడు. తగిన ప్రణాళికలను రూపొందించుకోకపోతే నష్టం తప్పదని హెచ్చరించాడు.

మరిన్ని వార్తలు