కోహ్లిసేనకు ఎదురు దెబ్బ

11 Jun, 2019 13:43 IST|Sakshi

లండన్‌ : భారత క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త.  గాయం కారణంగా టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు మూడు వారాలు విశ్రాంతి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ధావన్‌ కొన్ని లీగ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శతకం బాదిన గబ్బర్‌.. ఆ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆసీస్‌ బౌలర్‌ కౌల్టర్‌ నీల్‌ వేసిన బంతికి ధావన్‌ ఎడమ బొటనవేలికి గాయమైంది. బ్యాటింగ్‌ చేసే సమయంలో ఆరంభంలోనే గాయమైనా.. గబ్బర్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) శతకంతో మెరిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. 

ఈ గాయం కారణంగా ధావన్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. అతని స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేశాడు. మ్యాచ్‌ అనంతరం గబ్బర్‌కు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగిందని తేలింది. దీంతో మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ధావన్‌ పలు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ధావన్‌ ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడు అనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ధావన్‌ గైర్హాజరీతో కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.  రాహుల్‌ ఓపెనింగ్‌కు వస్తే మిడిలార్డర్‌లో కార్తీక్‌, విజయ్‌శంకర్‌లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. 

మరిన్ని వార్తలు