ధావన్‌ ధమాకా...

27 Jul, 2017 00:26 IST|Sakshi
ధావన్‌ ధమాకా...

మెరుపు సెంచరీతో   చెలరేగిన శిఖర్‌ ధావన్‌
పుజారా అజేయ శతకం
భారత్‌ 399/3
శ్రీలంకతో తొలి టెస్టు  


భారత టాప్‌ ఆర్డర్‌ గాలేలో గర్జించింది. శ్రీలంకతో మొదలైన తొలి టెస్టులో సెంచరీల మోత మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, చతేశ్వర్‌ పుజారా లంక బౌలర్ల భరతం పట్టారు. ఈ ధాటిని తట్టుకోలేని ఆతిథ్య బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించారు. 90 ఓవర్ల పాటు చెమటోడ్చినా... మూడు వికెట్లకు మించి పడగొట్టలేకపోయారు. దీంతో తొలి రోజే కోహ్లి సేన తమ ఖాతాలో భారీ స్కోరును జమ చేసుకుంది.  

గాలే: లంకలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) శివమెత్తాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారా (247 బంతుల్లో 144 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) కదం తొక్కాడు.  బుధవారం మొదలైన తొలి టెస్టులో వీరిద్దరు శ్రీలంక బౌలర్లను అడ్డూ అదుపే లేకుండా చితక్కొట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోజంతా కష్టపడిన లంక బౌలర్లు భారత్‌ బ్యాటింగ్‌ ధాటిని ఏ దశలోనూ నిలువరించలేకపోయారు.

సెషన్‌కో వికెట్‌ చొప్పున కేవలం మూడే వికెట్లు తీయగలిగారు. ధావన్, పూజారాలిద్దరూ కలిసి 46.4 ఓవర్లలో రెండో వికెట్‌కు 253 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ (26 బంతుల్లో 12; 2 ఫోర్లు), కెప్టెన్‌ కోహ్లి (8 బంతుల్లో 3) విఫలమయ్యారు. శిఖర్‌ 10 పరుగుల తేడాతో ‘డబుల్‌’ సెంచరీని చేజార్చుకున్నా... కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ ముగ్గురి వికెట్లను నువాన్‌ ప్రదీప్‌ (3/64) పడగొట్టాడు. మిగతా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం మినహా చేయగలిగిందేమీ లేకపోయింది. పుజారాతో పాటు రహానే (39 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

సెషన్‌–1:  ముకుంద్‌ ఫ్లాప్‌...
టాస్‌ గెలిచిన కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకోగా... రెగ్యులర్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్‌కు తొలి టెస్టులో మరో అదృష్టం కూడా కలిసొచ్చింది. ముందుగా జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ప్రదీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో ముకుంద్‌... డిక్‌వెలాకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌ లలో ముకుంద్‌కు ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఈ దశలో పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరుస్తున్న ధావన్‌ 31 పరుగుల వద్ద బతికిపోయాడు. లహిరు కుమార వేసిన ఓవర్లో బంతి శిఖర్‌ బ్యాట్‌ అంచును తాకుతూ రెండో స్లిప్‌లో ఉన్న గుణరత్నే చేతుల్లోకి వెళ్లగా అతను నేలపాలు చేశాడు. దీంతో ‘లైఫ్‌’ వచ్చిన ధావన్‌ భారీ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. లంచ్‌ విరామానికి ముందే 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. జట్టు స్కోరు కూడా వంద పరుగులు దాటింది. ఓవర్లు: 27, పరుగులు: 115, వికెట్లు: 1

సెషన్‌–2:  ధావన్‌ విశ్వరూపం
దీన్ని రెండో సెషన్‌ అనేకంటే శిఖర్‌ సెన్సేషన్‌ అంటేనే అతికినట్లు సరిపోతుంది. క్రీజులో పాతుకుపోయిన పుజారాతో కలిసి ధావన్‌ లంక బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వేగం పెంచిన ఈ ఓపెనర్‌ అదును చిక్కిన బంతిని వదల్లేదు. బౌండరీ లైనే ముచ్చట పడే షాట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతను టెస్టుల్లో ఐదో సెంచరీ చేశాడు. 16 ఫోర్ల సాయంతో 110 బంతుల్లోనే వన్డేను తలపించేలా శతకాన్ని సాధించాడు. తర్వాత కాసేపటికి పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత ధావన్‌ వేగం పెంచాడు. దీంతో 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.

పుజారా తెలివిగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ధావన్‌కే అవకాశమిచ్చాడు. ఈ జోరుతో ధావన్‌ 147 బంతుల్లో 150 పరుగులు చేసి... డబుల్‌ సెంచరీ దిశగా పయనించాడు. లంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. టీ విరామానికి ముందు ‘డబుల్‌’కు చేరువైన ధావన్‌ ఎట్టకేలకు ప్రదీప్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌లో ఉన్న మాథ్యూస్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. ఓవర్లు: 28, పరుగులు 167, వికెట్లు: 1

సెషన్‌–3:  కోహ్లి వైఫల్యం
ఈ సెషన్‌ మొదలైన రెండో ఓవర్లోనే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడు పరుగులకే నిష్క్రమించాడు. ఇతను ప్రదీప్‌ బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే అంపైర్‌ తిరస్కరించడంతో లంక ‘రివ్యూ’కు వెళ్లింది. ఇందులో కోహ్లి అవుటైనట్లు తేలడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నిలకడగా ఆడే రహానే... పుజారాకు జతయ్యాడు. వీళ్లిద్దరూ నింపాదిగా ఆడారు. ఈ క్రమంలో చతేశ్వర్‌ పుజారా 173 బంతుల్లో 8 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 12వ సెంచరీ. శ్రీలంక 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకుంది. అయితే అప్పటికే భారత బ్యాట్స్‌మెన్‌ జోరుకు నీరుగారిన లంక బౌలర్లు ఈ కొత్త∙బంతితోనూ రాణించలేక పోయారు. పైగా పుజారా, రహానే మొండిగా ఆడటంతో ఆట నిలిచే వరకు మరో వికెట్‌ను తీయలేకపోయారు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీళ్లిద్దరూ 113 పరుగులు జోడించారు. దీంతో ఆతిథ్య బౌలర్లు నిరాశగా మైదానాన్ని వీడారు. ఓవర్లు: 35 పరుగులు: 117, వికెట్లు: 1

హార్దిక్‌ పాండ్యా 289
వన్డేల్లో ఆకట్టుకుంటున్న హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున 289వ టెస్టు క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేతుల మీదుగా పాండ్యా టోపీని అందుకున్నాడు. 2003లో ఇర్ఫాన్‌ పఠాన్‌ తర్వాత భారత్‌ తరఫున టెస్టు ఆడుతున్న బరోడా రంజీ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యానే కావడం విశేషం.

4 లంచ్, టీ సెషన్‌ మధ్యలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా శిఖర్‌ ధావన్‌ (126) గుర్తింపు పొందాడు.కాంప్టన్‌ (173–ఇంగ్లండ్‌; 1954లో పాక్‌పై)...హ్యామండ్‌ (150–ఇంగ్లండ్‌;1933లో న్యూజిలాండ్‌పై), మెక్‌క్యాబ్‌ (127–ఆస్ట్రేలియా; 1938లో ఇంగ్లండ్‌పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

2 వీరేంద్ర సెహ్వాగ్‌ (133–శ్రీలంకపై ముంబైలో 2009లో) తర్వాత భారత్‌ తరఫున ఒకే సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.

190 టెస్టుల్లో ధావన్‌కిదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఆసీస్‌పై 187 పరుగులు చేశాడు. అంతేకాకుండా 190ల్లో అవుటైన ఏడో భారత క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు.

399 లంకగడ్డపై ఓ పర్యాటక జట్టు, విదేశీ గడ్డపై తొలి రోజు భారత్‌ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే.

3 భారత్‌ తరఫున ఇద్దరు ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్లుగా రావడం ఇది మూడోసారి. గతంలో గంభీర్‌–ఇర్ఫాన్‌ పఠాన్‌ (2005లో శ్రీలంకపై); గంభీర్‌–ముకుంద్‌ (2011లో ఇంగ్లండ్‌పై) ఇలా చేశారు.

2 టెస్టు మ్యాచ్‌ తొలి రోజున భారత్‌ చేసిన రెండో అత్యధిక స్కోరు 399/3. శ్రీలంకతో 2009లో కాన్పూర్‌లో జరిగిన టెస్టులో తొలి రోజున భారత్‌ 2 వికెట్లకు 417 పరుగులు చేసింది.

30 ఈ మ్యాచ్‌తో ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన కెరీర్‌లో 50వ టెస్టులో బరిలోకి దిగాడు.  భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన 30వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు.  

గాయంతో గుణరత్నే అవుట్‌
గాలే: శ్రీలంక బ్యాట్స్‌మన్‌ అసెలా గుణరత్నే గాయంతో టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతని ఎడమ చేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా అతన్ని హుటాహుటిన సర్జరీ కోసం కొలంబోకు తరలించారు. దాంతో ఈ టెస్టులో శ్రీలంక రెండు ఇన్నింగ్స్‌లలోనూ పది మంది బ్యాట్స్‌మెన్‌తో ఆడాల్సి ఉంటుంది.

ఈ సిరీస్‌ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో కుటుంబసభ్యులతో మెల్‌బోర్న్‌లో గడపాలనుకున్నాను. అక్కడే ప్రాక్టీస్‌ చేసి వన్డే సిరీస్‌కల్లా ఫిట్‌గా ఉండాలనేదే నా ప్రణాళిక. కానీ విధి మాత్రం భిన్నమైన ప్రణాళికను నా ముందుంచింది. హాంకాంగ్‌లో సెలవులు గడపుతున్నపుడు విజయ్‌ గాయపడ్డాడని, అతని స్థానంలో నన్ను ఎంపిక చేశారని పిలుపు వచ్చింది. టెస్టు జట్టులో తిరిగి వచ్చేందుకు చెమటోడ్చుతున్న సమయంలో అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నిజానికి లంక పర్యటనకు ముందు చాంపియన్స్‌ ట్రోఫీలో బాగా ఆడాను. ఇప్పుడదే ఆత్మవిశ్వాసంతో, అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నా. మ్యాచ్‌ కోసం నెట్స్‌లోనూ అదే ఆలోచనతో కష్టపడ్డాను. గాలేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం ఆనందంగా ఉంది.                                                                      
– శిఖర్‌ ధావన్‌ 

శిఖర్‌ ధావన్‌ సెంచరీ ఇలా
పరుగులు 190
బంతులు 168
సింగిల్స్‌ 66
ఫోర్లు 31
సిక్సర్లు 0
స్ట్రయిక్‌ రేట్‌ 113.09

మరిన్ని వార్తలు