అయ్యో ధావన్‌..!

12 Jun, 2019 03:26 IST|Sakshi

భారత ఓపెనర్‌ చేతికి గాయం

రెండు మ్యాచ్‌లకు దూరం

టీమిండియా బృందానికి షాక్‌

జట్టుతోనే కొనసాగనున్న ధావన్‌  

నాటింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో రెండు అద్భుత విజయాలు సాధించి ఊపు మీదున్న భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్, గత మ్యాచ్‌ హీరో శిఖర్‌ ధావన్‌ బొటన వేలి గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లలో ధావన్‌ ఆడే అవకాశం లేదు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ వేసిన బౌన్సర్‌ అతని ఎడమచేతికి బలంగా తగిలింది. రెండు బంతుల తర్వాత వేలిపై స్ప్రే చేసిన తర్వాత అతను ఆడేందుకు ప్రయత్నించినా, నొప్పితో అదే ఓవర్లో మళ్లీ చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఆటను కొనసాగించిన ధావన్‌ 109 బంతుల్లోనే 117 పరుగులు చేసి భారత్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గాయం కారణంగా ధావన్‌ ఫీల్డింగ్‌కు దిగకపోవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మొత్తం రవీంద్ర జడేజా సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు.

అయితే తదనంతరం శిఖర్‌ చేతికి స్కానింగ్‌ నిర్వహించగా ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’గా తేలింది. అతని ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్యభాగంలో వెనుకవైపు గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.  పూర్తిస్థాయి ఇతర పరీక్షల ఫలితాలు రాకపోవడంతో గాయం తీవ్రత ఎంత, ఎన్ని రోజుల్లో తగ్గవచ్చనే దానిపై స్పష్టత లేకపోయినా...తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగడని మాత్రం ఖాయమైపోయింది. భారత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్‌హర్ట్‌ కూడా ధావన్‌తో పాటు ఉండి ప్రత్యేక వైద్యులతో చర్చిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ‘శిఖర్‌ ధావన్‌ ఇంగ్లండ్‌లో జట్టుతో పాటే కొనసాగుతాడు. అతడి గాయాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దాంతో ప్రత్యామ్నాయ ఆటగాడి గురించి మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టమైంది.  

అతను లేని లోటు...
ఐసీసీ టోర్నీలలో ధావన్‌ ప్రదర్శనను ఒక్కసారి గుర్తు చేసుకుంటే జట్టులో అతని విలువేమిటో అర్థమవుతుంది. వన్డే ప్రపంచ కప్, చాంపియన్స్‌ ట్రోఫీలలో కలిపి 20 మ్యాచ్‌లలో అతను 65.15 సగటుతో 1,238 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ కప్‌లోనే అతను 10 మ్యాచ్‌లలో 53.70 సగటుతో 537 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్‌పై అద్భుత సెంచరీతో తన సత్తాను ప్రదర్శించి టోర్నీలో రాబోయే మ్యాచ్‌లలో చెలరేగేందుకు సిద్ధమైన తరుణంలో గాయం దెబ్బ తీసింది.

గత కొన్నేళ్లలో భారత్‌ సాధించిన అద్భుత విజయాల్లో ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లదే కీలక పాత్ర. ఈ జోడీ కుదురుకున్నాక మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. వీరు వేసిన బలమైన పునాదిపైనే కోహ్లి తదితరులు చెలరేగి ప్రత్యర్థులను పడగొట్టగలిగారు. 16 సెంచరీ భాగస్వామ్యాలు సహా 4,681 పరుగులు జోడించిన వీరిద్దరిలో ఒకరు దూరం కావడమంటే కొత్త ఓపెనింగ్‌ జంటతో టీమిండియా ఆడాల్సిందే. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించవచ్చు.  

వేచి చూసే ధోరణి!
శిఖర్‌ ధావన్‌ విషయంలో ప్రస్తుతానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సరైన నిర్ణయమే తీసుకుంది. టీమిండియా ఫామ్, ఇప్పటికే గెలిచిన రెండు ప్రధాన మ్యాచ్‌లువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మన జట్టు సెమీఫైనల్‌ చేరడం దాదాపు ఖాయమే. గాయం ప్రమాదకరమైంది కాకుండా రెండు మ్యాచ్‌ల తర్వాతే అతను తిరిగొస్తే సమస్యే లేదు. అలా కాకుండా దురదృష్టవశాత్తూ లీగ్‌ దశ మొత్తం కూడా ధావన్‌ దూరమైనా... నాకౌట్‌ సమయానికి కోలుకుంటే చాలని జట్టు భావిస్తోంది. అందుకు చాలినంత సమయం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయపడిన తర్వాత అతను పూర్తిగా జట్టు నుంచి బయటకు వెళ్లిపోతేనే అతని స్థానంలో మరో ఆటగాడిని టెక్నికల్‌ కమిటీ అనుమతిస్తుంది.

ఇప్పుడు ధావన్‌ను తప్పించి మరెవరినైనా తీసుకుంటే ఒకవేళ కోలుకున్నా అతను మళ్లీ టీమ్‌లోకి రాలేడు. మరొకరికి గాయమైతే తప్ప అది సాధ్యం కాదు! కాబట్టి సెలక్టర్లు ధావన్‌ను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్లు శరణ్‌దీప్‌ సింగ్, దేవాంగ్‌ గాంధీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జట్టుతో పాటే ఉన్నారు. ఇక వచ్చే మ్యాచ్‌లలో రోహిత్‌కు తోడుగా స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ను పంపడం దాదాపు ఖాయమే. మిడిలార్డర్‌లో దినేశ్‌ కార్తీక్‌ లేదా విజయ్‌ శంకర్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

>
మరిన్ని వార్తలు