శివ థాపా ‘పసిడి పంచ్’

9 Jul, 2013 10:54 IST|Sakshi
శివ థాపా

** దేవేంద్రో, మన్‌దీప్‌లకు రజతాలు  
** ఆసియా సీనియర్ బాక్సింగ్
 
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ భవిష్యత్ ఆశాకిరణం తానేనని నిరూపించుకుంటూ శివ థాపా ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. జోర్డాన్‌లో సోమవారం జరిగిన 56 కేజీల విభాగంలో శివ థాపా స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల పిన్న వయస్సులో ఆసియా పోటీల్లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు.

ఫైనల్లో శివ థాపా 2-1తో ఒబాదా అల్‌కబె (జోర్డాన్)పై విజయం సాధించాడు. అస్సాంకు చెందిన ఈ యువ బాక్సర్ గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. రాజ్‌కుమార్ సంగ్వాన్ (1994), సురంజయ్ సింగ్ (2009) తర్వాత ఆసియా సీనియర్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా శివ థాపా నిలిచాడు.

మరోవైపు ఫైనల్స్‌లో ఓడిన దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు) రజత పతకాలతో... సెమీఫైనల్లో పరాజయం పాలైన మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు