మీకిచ్చిన సపోర్ట్‌ను మరిచిపోయారా?: అక్తర్‌

12 Sep, 2019 16:11 IST|Sakshi

కరాచీ:  తమ దేశ పర్యటనకు దూరంగా ఉండాలని అధిక శాతం మంది శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు నిర్ణయించుకోవడంతో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక దేశంలో క్రికెట్‌ను తిరిగి బ్రతికించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే, ఇదేనా మీ సపోర్ట్‌ అంటూ ప్రశ్నించాడు. తమ జాతీయ జట్టు ఎప్పుడూ శ్రీలంక క్రికెట్‌కు అండగానే నిలిచిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘  ఒకేసారి 10 మంది శ్రీలంక క్రికెటర్లు పాక్‌ పర్యటనకు వెనుకడుగు వేయడం చాలా నిరాశ పరిచింది. మేము మీకు ఎప్పుడూ అండగానే ఉన్నాం. మీకిచ్చిన సపోర్ట్‌ మరిచిపోయారా.

ఇటీవల శ్రీలంకలోని ఒక చర్చిలో దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టు మీ దేశంలో పర్యటించింది. ఆ దాడి తర్వాత తొలుత పర్యటించిన జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తానే.  భద్రతా కారణాలతో 1996 వరల్డ్‌కప్‌ సమయంలో శ్రీలంకలో ఆడబోమని ఆసీస్‌, వెస్టిండీస్‌లు తెగేసి చెప్పాయి. అప్పుడు కూడా భారత్‌తో పాటు మీకు అండగా ఉన్నది పాకిస్తానే. మేము మీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడి మీకు సహకారం అందించాం. మేము ఇప్పుడు శ్రీలంక నుంచి మద్దతు ఆశిస్తున్నాం.బోర్డు సహకారం అందిస్తున్నది కాబట్టి.. ఆటగాళ్లు కూడా మాకు అండగా నిలవండి’ అని అక్తర్‌ కోరాడు.

పాకిస్తాన్‌లో శ్రీలంక జట్టు పర్యటించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా లసిత్‌ మలింగా, ఏంజెలో మాథ్యూస్‌, దినేశ్‌ చండీమాల్‌, సురంగా లక్మల్‌, కరుణరత్నే, తిషారీ పెరీరా అఖిల ధనంజయ, ధనజంయ డిసిల్వా, కుశాల్‌ పెరీరా తదితరులు బాయ్‌ కాట్‌ ప్రకటించారు. తమకు పాకిస్తాన్‌లోని భద్రతపై అనుమానం ఉందనే కారణంతో వారు పర్యటనకు వెళ్లలేమని తేల్చిచెప్పారు. దాంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి మరోసారి షాక్‌ తగిలినట్లయ్యింది. కచ్చితంగా పాక్‌లో పర్యటిస్తుందనుకున్న పూర్తిస్థాయి శ్రీలంక జట్టులోని సీనియర్లు వెనుకడుగు వేయడం పీసీబీకి మింగుడు పడటం లేదు.

మరిన్ని వార్తలు