భారత్‌.. మంచి పేస్‌ బౌలింగ్‌ జట్టు కాదు!

20 Jan, 2018 13:13 IST|Sakshi

కరాచీ: ఇప‍్పటికీ భారత క్రికెట్‌ జట్టు మంచి ఫాస్ట్‌ బౌలింగ్‌ జట్టు కాదని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు పూర్తి స్థాయి ఫాస్ట్‌ బౌలింగ్‌ క్రికెట్‌ దేశంగా ఎదగడానికి చాలా సమయం ఉందన్నాడు. అంతకుముందు ఎన్నడూ చూడని అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ ఎటాకజట్టుగా ప్రస్తుత టీమిండియా ఎదిగిందా అనే ప్రశ్నకు కాదనే సమాధానమిచ్చాడు అక్తర్‌.

' నా దృష్టిలో భారత్‌ జట్టు ఇప్పటికీ మంచి ఫాస్ట్‌ బౌలింగ్‌ జట్టు కాదు. వారు ఇప్పుడిప్పుడే ఫాస్ట్‌ బౌలింగ్‌ వనరుల్ని దొరకబుచ్చుకుంటున్నారు. ఒక చక్కటి ఫాస్ట్‌ బౌలింగ్‌ జట్టుగా ఎదగడానికి భారత్‌ ఇంకా చాలా దూరంలో ఉంది'  అని అక్తర్‌ పేర్కొన్నాడు. మనకు భారత జట్టు ఒక అత్యుత్తమ బ్యాటింగ్‌ జట్టుగా మాత్రమే తెలుసని, అయితే ఇటీవల కాలంలో పేస్‌ బౌలింగ్‌లో ఆ జట్టు చక్కటి ఫలితాల్ని సాధిస్తుందన్నాడు. కాకపోతే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలింగ్‌ జట్టుగా ఎదగడానికి టీమిండియా ఇంకా శ్రమించక తప్పదన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎటువంటి పోరాట పటిమ ప్రదర్శించకుండా లొంగిపోవడం తాను ఊహించలేదన్నాడు. రెండు అత్యుత్తమ టెస్టు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో భారత్‌ ఈ తరహాలో పరాజయం మూటగట్టుకోవడం నిజంగా దారుణమన్నాడు. భారత జట్టు బ్యాటింగ్‌లో సమష్టిగా విఫలం కావడం వల్లే వరుస ఓటముల్ని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. రెండో టెస్టులో కూడా టీమిండియా స్టార్‌ ఆటగాడు అజింక్యా రహానేకు తుది జట్టులో చోటు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
 

మరిన్ని వార్తలు