అతనికి గాయం.. నాకు ఒక జ్ఞాపకం!

23 Apr, 2020 11:04 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటకు 160 కి.మీ వేగంతో బంతుల్ని సంధించడంలో అక్తర్‌ దిట్ట. తన హయాంలో ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీతో పోటీ పడి బౌలింగ్‌ చేసే వాడు అక్తర్‌. అప్పట్లో వీరిద్దరే ఫాస్టెస్ట్‌ బౌలర్లు. వీరి బౌలింగ్‌లో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్స్‌ సైతం గాయపడిన సందర్భాల్లో ఎన్నో​. వారి బౌలింగ్‌ను అంచనా వేయడంలో ఏమాత్రం విఫలమైనా అది ఎక్కడో చోట గాయపరచడం ఖాయమన్నట్లు ఉండేది. ఇలా తన బౌలింగ్‌లో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా గాయపడిన క్షణాలను అక్తర్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ('బ్రెట్ ‌లీ బ్యాటింగ్ అంటే భ‌య‌ప‌డేవాడు')

2004లో చాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్‌ షార్ట్‌ పిచ్‌ బంతిని వేగంగా సంధించాడు. అయితే ఆ బంతిని షాట్‌ కొడదామని ముందుగా ఫిక్స్‌ అయిన లారా.. చివరి దశలో తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ ఆ బంతి వేగంగా వచ్చి హెల్మెట్‌పై నుంచి దూసుకుపోవడంతో లారా విలవిల్లాడిపోయాడు.  ఆ క్రమంలోనే లారా తలను పట్టుకుని పిచ్‌లోనే కూలబడిపోయాడు.  అవి నిజంగా భయంకరమైన క్షణాలే. లారాకు ఏమైందో అనే కంగారు అటు పాక్‌ శిబిరంలోనూ, ఇటు విండీస్‌ శిబిరంలోనూ నెలకొంది. అది లారాకు గాయం మాత్రమే చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోను షోయబ్‌ అక్తర్‌ తాజాగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ క్రికెట్‌ గేమ్‌లో ఒక లెజెండ్ లారా. ఆనాడు లారాను గాయపరిచిన మూమెంట్‌.. నా కెరీర్‌లో ఒక జ్ఞాపకం. అతని శకంలో ఉత్తమ బ్యాట్స్‌మన్ లారా. లారాతో ఆటను ఎప్పుడూ ఆస్వాదించే వాడిని’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.  ('నాపై ఒత్తిడి తెచ్చుంటే అక్రమ్‌ను చంపేవాడిని')

>
మరిన్ని వార్తలు