బంతిని వదిలేసి.. వికెట్లను హిట్‌ చేశాడు

18 May, 2019 12:18 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: క్రికెట్‌లో ఆటగాళ్లు హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరడం కొత్తేమీ కాదు. దిగ్గజ ఆటగాళ్ల సైతం హిట్‌ వికెట్‌గా ఔటైన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. సాధారణంగా బ్యాట్స్‌మన్‌ బంతిని కొట్టిన తర్వాత అదుపు చేసుకోలేక వికెట్లపై పడటమే హిట్‌ వికెట్‌లో ఎక్కువ చోటు చేసుకుంటుంది. అయితే బంతిని వదిలేసి, వికెట్లను హిట్‌ చేసిన సందర్భాల్లో అరుదుగానే చెప్పాలి. ఈ తరహాలో ఔటయ్యాడు పాకిస్తాన్‌ వెటరన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో మాలిక్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్లను కొట్టేశాడు. ఇది అటు అభిమానులతో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో నవ్వులు పూయించింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ వేసిన 47 ఓవర్‌ నాల్గో బంతిని ఆడే క్రమంలో వికెట్లను కొట్టేశాడు మాలిక్‌. ఇక్కడ మాలిక్‌ను దురదృష్టం వెంటాడటంతో భారంగా పెవిలియన్‌ చేరాడు. 26 బంతుల్లో  4 ఫోర్లు సాయంతో 41 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్న మాలిక్‌ ఇలా ఔట్‌ కావడం పాక్‌ శిబిరంలో నిరాశ చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో అయితే మాలిక్‌ ఔటైన తీరు ఫన్నీగా మారిపోయింది.
(ఇక్కడ చదవండి: ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌)

పాకిస్తాన్‌తో జరిగిన నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. థర్డ్‌ డౌన్‌లో వచ్చిన మాలిక్‌ తొలి రెండు బంతుల్లో పరుగులేమీ చేయలేదు. అయితే తన ఇన్నింగ్స్‌ను ఫోర్‌తో ఆరంభించాడు మాలిక్‌. ఇంగ్లండ్‌ పేస్‌ విభాగాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. కాగా, స్కోరును పెంచాలనే క్రమంలో చివరి ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించే యత్నం చేశాడు. ఈ క్రమంలోనే మార్క్‌ వుడ్‌ వేసిన 47 ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆపై రెండు, మూడు బంతులకు రెండేసి పరుగులు చేశాడు. అయితే నాల్గో బంతిని కవర్స్‌ మీదుగా కొడదామని భావించిన మాలిక్‌.. బంతిని కొట్టబోయి వికెట్లను కొట్టేశాడు. ఇలా వన్డే క్రికెట్‌లో మాలిక్‌ హిట్‌ వికెట్‌గా ఔట్‌ కావడం రెండోసారి. 2003లోతొలిసారి హిట్‌ వికెటైన మాలిక్‌.. 16 ఏళ్ల తర్వాత మరోసారి సెల్ఫ్‌ ఔట్‌ అయ్యాడు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు