'ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం శుద్ధ దండగ'

9 Aug, 2016 15:56 IST|Sakshi
'ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం శుద్ధ దండగ'

ఢిల్లీ: రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లపై ప్రముఖ రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం అనేది శుద్ద దండగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పతకాలు తేలేనప్పుడు ఒలింపిక్స్కు వెళ్లడం అనవసరమని విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్న భారత క్రీడాకారులు.. తమ తమ ప్రదర్శనలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ వృథా ప్రయాసతో చాలా ధనవ్యయం తప్పితే ఏమీ కనిపించడం లేదన్నారు.

అయితే దీనిపై భారత షూటర్ అభినవ్ బింద్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలు  స్పందించారు. ఈ తరహా విమర్శలు చేయడం శోభా డేకు తగదని, ఒక మెగా ఈవెంట్లో భారత్ ప్రాతినిథ్యం ఉన్నందుకు సంతోషించాలని బింద్రా తెలపగా, ఒలింపిక్స్లో పాల్గొంటున్న అథ్లెట్లపై విమర్శలు చేస్తూ నిరూత్సాహపరచడం తగదని గుత్తా జ్వాలా పేర్కొంది.  మరోవైపు నెటిజన్లు సైతం శోభా తీరును తప్పుబట్టారు. ఏదొక వంకతో సోషల్ మీడియాలోకి రావడం, విమర్శలు చేయడం కొంతమంది సెలబ్రెటీలకు పరిపాటిగా మారిపోయిందని నెటిజన్లు మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు