భారత మహిళల జట్టుకు షాక్‌ 

3 Oct, 2018 00:06 IST|Sakshi
తానియా సచ్‌దేవ్‌ గేమ్‌ జరుగుతుండగా కునుకు తీస్తున్న భారత మహిళల జట్టు కెప్టెన్‌ జాకబ్‌ అగార్డ్‌ 

హంగేరి చేతిలో 1–3తో ఓటమి

బటూమి (జార్జియా): చెస్‌ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఊహించని రీతిలో తొలి పరాజయం ఎదురైంది. హంగేరి జట్టుతో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–3 తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత బృందం పతకం నెగ్గే అవకాశాలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 50 ఎత్తుల్లో తన్‌ త్రాంగ్‌ హోంగ్‌ చేతిలో ఓడిపోగా... గారా అనీటాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో; జూలియానా తెర్బెతో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అయితే మరో గేమ్‌లో తానియా సచ్‌దేవ్‌ 56 ఎత్తుల్లో గారా టికియా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. ఎనిమిదో రౌండ్‌ తర్వాత భారత మహిళల జట్టు 11 పాయింట్లతో 15వ స్థానంలో ఉంది. 

పురుషుల జట్టు విజయం... 
మరోవైపు భారత పురుషుల జట్టు ఆరో విజయం నమోదు చేసింది. చెక్‌ రిపబ్లిక్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో భారత్‌ 2.5–1.5తో గెలిచింది. విశ్వనాథన్‌ ఆనంద్‌–డేవిడ్‌ నవారా గేమ్‌ 30 ఎత్తుల్లో; విదిత్‌–విక్టర్‌ లాజ్నికా గేమ్‌ 66 ఎత్తుల్లో; ఆధిబన్‌–జిబినెక్‌ గేమ్‌ 17 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... శశికిరణ్‌ 36 ఎత్తుల్లో జిరీ స్టోసెక్‌ను ఓడించి భారత్‌ను గెలిపించాడు. ఎనిమిదో రౌండ్‌ తర్వాత భారత్‌ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.  15 పాయింట్లతో అమెరికా తొలి స్థానంలో, 14 పాయింట్లతో పోలాండ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. 

 

మరిన్ని వార్తలు