బుల్లెట్ దిగింది!

30 Jul, 2014 13:28 IST|Sakshi
బుల్లెట్ దిగింది!

'ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా బుల్లెట్ దిగిందా, లేదా...' పోకిరి సినిమాలో హీరో మహేష్బాబు చెప్పిన డైలాగ్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షూటర్లకు ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. బరిలోకి దిగింది మొదలు అదరగొడుతున్నారు. 'షూటింగ్'లో సత్తా చాటి పతకాల పంట పండించారు.

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ షూటర్లు దుమ్ము రేపారు. ఒక్క షూటింగ్ ఈవెంట్ లోనే అత్యధికంగా 17 పతకాలు సాధించిపెట్టారు. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. మంగళవారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 35 పతకాలు చేరాయి.

ఒకరిద్దరు మినహా షూటర్లు అందరూ సమిష్టిగా రాణించి అభిమానుల అంచనాలను నిలబెట్టారు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ మాత్రం నిరాశపరిచాడు. ఫైనల్‌కు చేరుకోవడంలో ఫలమయ్యాడు. మనో షూటర్ రవి కుమార్ ఫైనల్లో తడబడ్డాడు.

సీనియర్ షూటర్లుతో ఔత్సాహిక షూటర్లు పతకాలు సాధించడం ఈసారి విశేషం. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ అంచనాలకు తగినట్టు రాణించారు. నారంగ్(రజతం, కాంస్యం) రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళా షూటర్లు శ్రేయాసి సింగ్, అపూర్వి చండేలా, అయోనికా పాల్, మలైకా గోయల్ పతకాల పంట పండించారు.

జీతూ రాయ్, గుర్పాల్ సింగ్, మహమ్మద్ అసబ్, ప్రకాశ్ నంజప్ప, లజ్జా గోస్వామి, మానవ్‌జిత్ సింగ్ సంధూ, సంజీవ్ రాజ్‌పుత్, హర్‌ప్రీత్ సింగ్ 'గురి' తప్పకుండా పతకాలు సాధించారు. భారత పతాకాన్ని అంతర్జాతీయ క్రీడా యవనికపై రెపరెపలాడించిన మన షూటర్లకు అభినందలు తెలుపుతూ.. మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు