ఖేల్ కహానీ

15 Jul, 2016 01:57 IST|Sakshi
ఖేల్ కహానీ

షూటింగ్
అందుబాటులో ఉన్న స్వర్ణాలు: 15

 
 కచ్చితత్వానికి అత్యున్నత పరీక్షగా పేర్కొనే షూటింగ్... ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభ (1896, ఏథెన్స్) క్రీడల్లోనే అరంగేట్రం చేసింది. 1904, 1928 గేమ్స్‌లలో మినహాయించి క్రమం తప్పకుండా ఈ ఈవెంట్ అన్ని ఒలింపిక్స్‌లోనూ జరుగుతోంది. అయితే మహిళల విభాగంలో మాత్రం ఈ ఈవెంట్‌ను 1984, లాస్‌ఏంజిల్స్ గేమ్స్ నుంచి నిర్వహిస్తున్నారు. 1900 గేమ్స్‌లో షూటర్లకు కదిలే లక్ష్యం కోసం పావురాలను వినియోగించినా ఆ తర్వాత వాటి స్థానంలో బంకమట్టి పాత్రలను ఉపయోగించారు. 1907లో అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ఏర్పడ్డాక  ఈక్రీడకు కొన్ని నిబంధనలు ఏర్పడ్డాయి. టార్గెట్ ఇబ్బంది లేకుండా కనిపించేందుకు షూటర్లు కళ్లద్దాలు ధరిస్తుంటారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రతీ షూటర్ తన శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా నిలబడడమే కాకుండా తమ శ్వాస ప్రక్రియను కూడా నియంత్రణలో ఉంచుకోవాల్సి వస్తుంది.

విభాగాలు:  ఓవరాల్‌గా రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ కేటగిరీల్లో పురుషులు తొమ్మిది, మహిళలు ఆరు విభాగాల్లో తలపడతారు. రైఫిల్ విభాగంలో పురుషులకు... 10మీ. ఎయిర్ రైఫిల్, 50మీ. రైఫిల్ ప్రోన్, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్; మహిళలు 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్, 10మీ. ఎయిర్ రైఫిల్‌లో పోటీపడతారు. ఇక పిస్టల్‌లో పురుషులు 50మీ. పిస్టల్, 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, 10మీ. ఎయిర్ పిస్టల్‌లో తలపడుతుండగా మహిళలు 10మీ. ఎయిర్ పిస్టల్, 25మీ. పిస్టల్‌లోనే పోటీ పడతారు. షాట్‌గన్‌లో పురుషులు డబుల్ ట్రాప్, స్కీట్, ట్రాప్‌లోనూ మహిళలు ట్రాప్, స్కీట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల విభాగంలో ఈసారి డబుల్ ట్రాప్ విభాగం లేదు.
 
అమెరికా ఆధిపత్యం: ఓవరాల్‌గా చూస్తే ఈ క్రీడలో అమెరికా అత్యధికంగా 53 స్వర్ణాలతో టాప్‌లో ఉంది. చైనా 21 స్వర్ణాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో అమెరికాకు దక్షిణ కొరియా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.  మహిళల విభాగంలో మాత్రం చైనా షూటర్లు ముందంజలో ఉన్నారు.
 
భారత్ నుంచి 12 మంది..: ఈసారి రియో గేమ్స్‌లో భారత్ నుంచి పతకాల సంఖ్య రెండంకెలకు చేరాలంటే షూటర్ల ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఎప్పటిలాగే అభినవ్ బింద్రా (10మీ. ఎయిర్ రైఫిల్), గగన్ నారంగ్ (10మీ. ఎయిర్ రైఫిల్, 50మీ. రైఫిల్ ప్రోన్, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్)పైనే కాకుండా ఈసారి జీతూ రాయ్ (10మీ. ఎయిర్ పిస్టల్, 50మీ. ఎయిర్ పిస్టల్)పై కూడా ఎక్కువ ఆశలు ఉన్నాయి. వీరే కాకుండా గుర్‌ప్రీత్ సింగ్ (10మీ. ఎయిర్ పిస్టల్, 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), కైనాన్ చెనాయ్, మనవ్ జిత్ సింగ్ సంధూ (ట్రాప్), చెయిన్ సింగ్ ( 50మీ. రైఫిల్ ప్రోన్, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్), ప్రకాష్ నంజప్ప (50మీ. పిస్టల్), మైరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్) పోటీపడుతున్నారు. మహిళల నుంచి అపూర్వి చండేలా, అయోనియా పాల్ (10మీ. ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధూ (10మీ. ఎయిర్ పిస్టల్, 25మీ. పిస్టల్) మాత్రమే బెర్త్ దక్కించుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు