పసిడి సౌరభం

25 Feb, 2019 01:45 IST|Sakshi

ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు 

స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌ సౌరభ్‌

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఒలింపిక్‌ బెర్త్‌ కూడా ఖాయం

నిరాశపరిచిన మను భాకర్‌

న్యూఢిల్లీ: మరో ఈవెంట్‌... మరో పసిడి పతకం... మరో ప్రపంచ రికార్డు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో వరుసగా రెండో రోజు భారత షూటర్‌ గురి అదిరింది. తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వి చండేలా ప్రపంచ రికార్డుతోపాటు పసిడి పతకం సొంతం చేసుకోగా... రెండో రోజు ఆదివారం 16 ఏళ్ల సౌరభ్‌ చౌధరీ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సంచలన ప్రదర్శన చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌ స్వర్ణ పతకంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు ఈ విభాగంలో భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను అందించాడు.    గత సంవత్సరం ఆసియా క్రీడల్లో, యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన సౌరభ్‌ చౌధరీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన తొలిసారే పసిడి పతకాన్ని దక్కించుకోవడం విశేషం. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సౌరభ్‌ 245 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఒలె ఒమెల్‌చుక్‌ (ఉక్రెయిన్‌–243.6 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సౌరభ్‌ బద్దలు కొట్టాడు.

దామిర్‌ మికెక్‌ (సెర్బియా–239.3 పాయింట్లు) రజతం... 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత పాంగ్‌ వె (చైనా–215.2 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సౌరభ్‌ జోరు ఎలా సాగిందంటే చివరి షాట్‌కంటే ముందుగానే అతనికి స్వర్ణం ఖాయమైంది. 76 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్‌ 587 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన అభిషేక్‌ వర్మ 24వ స్థానంలో... రవీందర్‌ సింగ్‌ 26వ స్థానంలో నిలిచారు. ‘ప్రపంచ రికార్డు, ఒలింపిక్‌ బెర్త్, స్వర్ణ పతకంలాంటి అంశాల గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని గురి చూసి కొట్టాను. అనుకున్న ఫలితం వచ్చింది. ఒకవేళ వీటి గురించి ఆలోచిస్తూ షూటింగ్‌ చేసి ఉంటే అనవసరంగా ఒత్తిడికిలోనై తుది ఫలితం మరోలా ఉండేదేమో’ అని సౌరభ్‌ వ్యాఖ్యానించాడు.   మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత యువతార మను భాకర్‌ ఫైనల్లో 22 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. వెరోనికా మేజర్‌ (హంగేరి–40 పాయింట్లు) స్వర్ణం సాధించగా... జింగ్‌జింగ్‌ జాంగ్‌ (చైనా), హనియా రొస్తామియాన్‌ (ఇరాన్‌) రజత, కాంస్య పతకాలు గెలిచారు. క్వాలిఫయింగ్‌లో 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచిన మను భాకర్‌ ఫైనల్లో మాత్రం తడబడింది. 

మరిన్ని వార్తలు