షార్ట్‌...  సిక్సర్ల సునామీ

29 Sep, 2018 02:00 IST|Sakshi

ఒకే ఇన్నింగ్స్‌లో 23 సిక్స్‌లతో ఆసీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

148 బంతుల్లోనే 257 పరుగులు   

సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డీఆర్సీ షార్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జేఎల్‌టీ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ క్వీన్స్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 23 సిక్స్‌లతో అతడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరఫున బరిలో దిగిన షార్ట్‌... 148 బంతుల్లో 15 ఫోర్లు సహా 257 పరుగులు సాధించాడు. అతడి జోరుతో జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 100, 150, 200, 250 వ్యక్తిగత స్కోరును షార్ట్‌ సిక్సర్లతోనే అందుకోవడం విశేషం. ఇందులో 200, 250 మార్క్‌ను మూడేసి వరుస సిక్సర్లతో చేరుకోవడం గమనార్హం. ఛేదనలో హీజ్లెట్‌ (107), క్రిస్‌ లిన్‌ (58) రాణించినా... ఆండ్రూ టై (6/46) ధాటికి క్వీన్స్‌ల్యాండ్‌ 271 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 116 పరుగులతో విజయం సాధించింది. 

►షార్ట్‌ ఈ ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. 
►  ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత సిక్స్‌ల రికార్డు నమీబియా ఆటగాడు జి.స్నైమన్‌ (113 బంతుల్లో 196; 7 ఫోర్లు, 17 సిక్స్‌లు, 2007లో యూఏఈపై) పేరిట ఉంది. క్రిస్‌ గేల్‌ (2015లో జింబాబ్వేపై), రోహిత్‌ శర్మ (2013లో ఆస్ట్రేలియాపై) 16 సిక్స్‌లు కొట్టారు. షార్ట్‌ 23 సిక్స్‌లతో వీటన్నిటిని బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 
►  తన రికార్డు ఇన్నింగ్స్‌తో షార్ట్‌ లిస్ట్‌ ‘ఎ’ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్‌లో అత్యధిక మూడో వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సర్రే ఆటగాడు (ఇంగ్లండ్‌) అలిస్టర్‌ డంకన్‌ బ్రౌన్‌ (160 బంతుల్లో 268; 30 ఫోర్లు, 12 సిక్స్‌లు; గ్లామోర్గన్‌పై 2002లో), భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ (173 బంతుల్లో 264; 33 ఫోర్లు, 9 సిక్స్‌లు; శ్రీలంకపై 2014లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు