ఈసారి 10 బంతుల్లోనే ఆ రికార్డు కొట్టాలి!

20 Jan, 2016 03:30 IST|Sakshi
ఈసారి 10 బంతుల్లోనే ఆ రికార్డు కొట్టాలి!

న్యూఢిల్లీ: ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు నిన్నటివరకు భారత క్రికెటర్ యువరాజ్‌ సింగ్ పేరిట ఉంది. దానిని ఇప్పుడు వెస్టిండిస్‌ విధ్వంసకారుడు క్రిస్‌ గేల్‌ సమం చేశారు. 12 బంతుల్లో అర్థ శతకం బాది తన రికార్డును గేల్‌ సమం చేయడం యువీకి నిరాశ కలిగించిందట. అదే 10 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి.. తన రికార్డును బద్దలుకొట్టి ఉంటే తాను మరింత ఆనందించేవాడినని యువరాజ్ చెప్పాడు.  ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌లో గేల్‌ యూవీ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యువరాజ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ '12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి గేల్ నన్ను నిరాశ పరిచాడు. కాకా(గేల్) నెక్స్ట్ టైం 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదు. లేదంటే ఏబీ డివీలియర్స్ ఆ ఫీట్‌ను సాధించే అవకాశముంది' అని పేర్కొన్నాడు.

20-20లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోతున్న క్రిస్ గేల్‌ 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఇటీవల 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టి యూవీ రికార్డును సమం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ మొదట ఈ అరుదైన ఘనతను సాధించాడు. స్టువార్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి.. భారత క్రికెట్ అభిమానుల మదిలో చెరుగని జ్ఞాపకాలను నమోదుచేసిన ఈ స్టైలిస్ట్ బ్యాట్స్‌మన్‌ 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.

>
మరిన్ని వార్తలు