అతి చేయకండి: నాధన్ లయాన్

13 Dec, 2016 15:39 IST|Sakshi
అతి చేయకండి: నాధన్ లయాన్

మెల్బోర్న్:ఒకవైపు పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణలో ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ) ముందు వరుసలో ఉంటే, దాన్ని మాత్రం ఆ దేశ స్పిన్నర్ నాధన్ లయాన్  వ్యతిరేకిస్తున్నాడు.  పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ల నిర్వహణలో అతిగా వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ సలహా ఇచ్చాడు.  సంప్రదాయ టెస్టు క్రికెట్కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదంటూనే, డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వల్ల అంతగా ఉపయోగం లేదన్నాడు. 'ఎక్కువ శాతంలో డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఇప్పటికే అడిలైడ్లో నిర్వహించిన పింక్ బాల్ మ్యాచ్ మంచి సక్సెస్ అయ్యింది. కానీ టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని రక్షించడం కూడా ముఖ్యమే. పింక్ బాల్ తో గేమ్లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్కు హాని జరిగే అవకాశం ఉంది. దాంతో పింక్ బాల్ గేమ్ను సాధ్యమైనంత తక్కువగా నిర్వహిస్తేనే మంచిది. డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై అతిగా వెళ్లకండి' అని లయాన్ తెలిపాడు.

ఈ మేరకు వచ్చే ఏడాది యాషెస్ సిరీస్లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు సీఏ ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టాడు. యాషెస్లో డే అండ్ నైట్ టెస్టును తాను కోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతేడాది వేసవిలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ లో తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెస్టిండీస్-పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో డే అండ్ నైట్ టెస్టును నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ నాల్గో టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్ గా ఆడనుంది.

మరిన్ని వార్తలు