‘దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి’

15 Feb, 2020 16:30 IST|Sakshi

కేప్‌టౌన్‌: దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బ్యాన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌ పాల్పడి ప్రపంచ ముందు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకు తగిన శిక్ష కూడా అనుభవించారు. ఆసీస్‌ క్రికెట్‌లో అలజడి రేపిన ఆ వివాదంతో వార్నర్‌, స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొనాల్సి వచ్చింది. 2018 మార్చి నెలలో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార్నర్‌, స్మిత్‌లు ట్యాంపరింగ్‌ పాల‍్పడిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మరొకసారి వస్తోంది. అప్పటి బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వార్నర్‌, స్మిత్‌లు రావడం  ఇదే తొలిసారి. దాంతో క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) గుండెల్లో దడ మొదలైంది. ఆనాటి వివాదాన్ని అభిమానులు మరొకసారి తమ మాటలతో తెరపైకి తెస్తారేమోననే సీఎస్‌ఏ భయం. (ఇక్కడ చదవండి: ఇది కదా అసలైన ప్రతీకారం)

దాంతో ముందుగానే ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది క్రికెట్‌ సౌతాఫ్రికా. ‘ దయచేసి ఆసీస్‌ క్రికెట్‌ జట్టుపై విమర్శలు చేయొద్దనే మా మనవి. ప్రధానంగా వార్నర్‌, స్మిత్‌లపై మాటల దాడి చేయొద్దు. నోటిని  అదుపులో ఉంచుకోండి. వారికి గౌరవం ఇవ్వండి. ఫీల్డ్‌లో కాంపిటేటివ్‌గా ఉండటమే మనముందున్న కర్తవ్యం. ఎటువంటి వివాదాలు, రాద్దాంతాలు అవసరం లేదు. స్పోర్ట్స్‌ను స్పోర్ట్స్‌గానే చూడండి. గతంలో జరిగింది ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. మీ నుంచి సహకారం అవసరం. ఈ తరహా స్పోర్ట్స్‌ ఈవెంట్‌ల అవసరం ఏమిటో మీరు తెలుసుకోండి. మిమ్ముల్ని ప్రార్థిస్తున్నా. ఆసీస్‌ క్రికెటర్లకు గౌరవం ఇవ్వండి. ముఖ్యంగా స్మిత్‌, వార్నర్‌లను బాధ పెట్టేలా ప్రవర్తించకండి’ అని సీఎస్‌ఏ తాత్కాలిక చీఫ్‌ ఎగ్టిక్యూటివ్‌  జాక్వస్‌ ఫాల్‌ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ మూడు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. (ఇక్కడ చదవండి: పాక్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా బ్రేక్‌!)


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా