పాంటింగ్‌ తన తొలి స్పీచ్‌తోనే..

3 Apr, 2018 11:25 IST|Sakshi
డేర్‌ డెవిల్స్‌ ఆటగాళ్లకు సూచనలిస్తున్న కోచ్‌ పాంటింగ్‌

న్యూఢిల్లీ : రెండు సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌ అందించిన మాజీ సారథి రికీ పాంటింగ్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌కు రికీ పాంటింగ్‌ ఢిల్లీ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పాంటింగ్‌ జట్టుతో చేరిన అనంతరం జరిగిన తొలి సమావేశంలో ఆటగాళ్ల రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రసంగించాడని అయ్యర్‌ తెలిపారు. ఆటలో గెలవడం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత ప్రదర్శన కాకుండా జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆడాలని ప్రతీ ఆటగాడికి పాంటింగ్‌ సూచించాడన్నారు. జట్టులోని ఆటగాళ్ల లోపాలను నిర్మోహటంగా వివరిస్తున్నాడన్నారు.

పాంటింగ్‌ మెంటార్‌గా ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2015 విజేతగా నిలిచిందని, ఇప్పుడు ఢిల్లీ ఐపీఎల్‌ 2018 విజేతగా నిలుస్తుందని అయ్యర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక డేర్‌ డెవిల్స్‌ మాజీ కోచ్‌ ద్రవిడ్‌పై కూడా ఈ ఆటగాడు తన అభిమానాన్ని చాటాడు. ద్రవిడ్‌, పాంటింగ్‌లిద్దరూ ఒకే మైండ్‌ సెట్‌ గలవారని, ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోరని వెల్లడించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రెండు సార్లు కప్‌ అందించిన గొప్ప సారథి గౌతం గంభీర్‌ అని ప్రస్తుతం అతని నాయకత్వంలోని ఢిల్లీ ఈ సారి ఐపీఎల్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతుందన్నారు. సీనియర్లు, జూనియర్లతో జట్టు పటిష్టంగా ఉందని, ఆటగాళ్లందరూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారని, ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు