శ్రేయస్‌ అయ్యర్​కు బంపర్‌ ఆఫర్‌‌‌!

7 May, 2018 18:31 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

కోహ్లి స్థానంలో అయ్యర్‌కు చోటు

విజయ్‌శంకర్‌, అక్షర్‌ పటేల్‌లకు అవకాశం

బెంగళూరు : అఫ్గానిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఆడే అవకాశం కనిపిస్తోంది. కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు కోహ్లి ఇంగ్లండ్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి అఫ్గాన్‌తో జరిగే ఎకైక టెస్టు, ఐర్లాండ్‌ సిరీస్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ పేరును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అయ్యర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అయ్యర్‌ను భుజ గాయంతో బాధపడ్డ కోహ్లికి బ్యాకప్‌ ప్లేయర్‌గా ఎంపిక చేసినప్పటికి తుది జట్టులో అవకాశం రాలేదు. అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. కోహ్లి గైర్హాజరీతో వైస్‌ కెప్టెన్‌ రహానే అఫ్గాన్‌ టెస్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు రోహిత్‌ శర్మ  సారథ్యం వహించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మ అఫ్గాన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆ సమయంలో వారి షెడ్యూలు ఖాళీగానే ఉందని తెలిపింది. ‘కోహ్లీ స్థానంలో శ్రేయస్‌, జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌, హార్డిక్‌ పాండ్యా బదులు విజయ్‌ శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఎంపిక ప్రక్రియను అనుసరించక తప్పింది కాదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇక ఇంగ్లండ్‌లో భారత్‌-ఏ పర్యటనకు అండర్‌-19 సంచలన ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్‌ గిల్‌, శివమ్‌ మావిల ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ సెలక్టర్లున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఏ), వెస్టిండీస్‌ ఏ జట్లతో భారత్‌-ఏ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడనుంది. అంతేగాకుండా ఇంగ్లండ్‌ లయన్స్‌తో నాలుగు రోజులు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. తుది జట్లను మంగళవారం ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు