క్రీజ్‌ను వదిలి వెళ్లను.. అంపైర్‌పై తిట్ల దండకం!

3 Jan, 2020 12:57 IST|Sakshi

మొహాలి: క్రికెట్‌లో మరో హైడ్రామా చోటు చేసుకుంది.  గతేడాది డిసెంబర్‌ నెలలో ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరోడా బ్యాట్స్‌మన్‌ యూసఫ్‌ పఠాన్‌ ఔట్‌ కాకపోయినా అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంతో భారంగా పెవిలియన్‌ వీడాడు. తొలుత క్రీజ్‌ను వదిలి వెళ్లడానికి ఇష్టపడని యూసఫ్‌.. చివరకు చేసేది లేక మైదానం నుంచి వెళ్లిపోయాడు. తాజాగా ఇదే తరహా సంఘటన మరొకటి చోటు చేసుకుంది. శుక్రవారం మొహాలీ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔట్‌ కాకపోయినా అంపైర్‌ పాశ్చిమ్‌ పఠాక్‌ ఔట్‌ ఇవ్వడంతో  కాసేపు క్రీజ్‌లో అలానే ఉండిపోయాడు. క్రీజ్‌ను వదిలి వెళ్లనంటూ మొండికేసిన గిల్‌.. అంపైర్‌ను తిట్టిపోశాడు. అసలు అంపైరింగ్‌ తెలుసా అంటా దుమ్మెత్తిపోశాడు. ఈ క‍్రమంలోనే  కాసేపు ఆట నిలిచిపోయింది. కాగా, రిఫరీ జోక్యంతో మళ్లీ మ్యాచ్‌ కొనసాగింది. శుభ్‌మన్‌ గిల్‌(23)మాత్రం ఔట్‌ కాని ఔట్‌కు పెవిలియన్‌ వీడక తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పంజాబ్‌ బ్యాటింగ్‌ను సాన్విర్‌ సింగ్‌-గిల్‌లు ఆరంభించారు .అయితే సాన్విర్‌ సింగ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో గుర్‌క్రీత్‌ సింగ్‌ మన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డాడు గిల్‌. కాగా, ఢిల్లీ బౌలర్‌ సిమర్‌ జీత్‌ సింగ్‌ వేసిన 14 ఓవర్‌ తొలి బంతిని గిల్‌ ఆడబోయాడు. అది బ్యాట్‌కు తగలకుండానే వెళ్లి అనుజ్‌ రావత్‌ చేతిల్లో పడింది. దీనిపై ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ పఠాక్‌ ఔట్‌గా ఇచ్చాడు. అయితే ఔట్‌ కాదనే విషయం గిల్‌కు స్పష్టంగా తెలియడంతో తాను క్రీజ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే  లేదని తేల్చిచెప్పాడు. అది ఔట్‌ కాదని టీవీ రిప్లేలో తేలడంతో గిల్‌కు మరింత కోపం తెప్పించింది. దాంతో అంపైర్‌ను తిట్ల దండకం అందుకున్నాడు. చివరకు మ్యాచ్‌ రిఫరీ జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు