శుబ్‌వార్త...

14 Jan, 2019 02:01 IST|Sakshi

భారత జట్టులోకి తొలిసారి శుబ్‌మన్‌ గిల్‌కు చోటు 

వన్డేల్లో విజయ్‌ శంకర్‌కు అవకాశం

పాండ్యా, రాహుల్‌ స్థానాల్లో ఎంపిక  

న్యూఢిల్లీ: యూత్‌ క్రికెట్‌తో పాటు రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో పరుగుల వరద పారించిన పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు తొలిసారి భారత సీనియర్‌ జట్టు పిలుపు లభించింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌ కోసం 19 ఏళ్ల గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిషేధం ఎదుర్కొంటున్న కేఎల్‌ రాహుల్‌ స్థానంలో అతడికి అవకాశం దక్కింది. తాజా రంజీ సీజన్‌లో గిల్‌ 10 ఇన్నింగ్స్‌లలో కలిపి 98.75 సగటుతో 790 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే భారత ‘ఎ’ జట్టు తరఫున న్యూజిలాండ్‌లో పర్యటించిన అనుభవం కూడా గిల్‌కు కలిసొచ్చింది.

వాస్తవానికి సెలక్టర్లు టెస్టు సిరీస్‌లో రాణించిన మయాంక్‌ అగర్వాల్‌నే ఎంపిక చేయాలని భావించారు. అయితే ఇటీవల అతని వేలికి అయిన గాయం తగ్గకపోవడంతో గిల్‌ వైపు మొగ్గు చూపారు. నిషేధానికి గురైన మరో ఆటగాడు హార్దిక్‌ పాండ్యా స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు పిలుపు దక్కింది. భారత్‌ తరఫున శంకర్‌ ఇప్పటి వరకు 5 టి20 మ్యాచ్‌లు ఆడగా, వన్డేల్లో అవకాశం లభించడం ఇదే మొదటి సారి. అతను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లి రెండో వన్డేకు ముందు జట్టుతో చేరతాడు. భారత్‌ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ శంకర్‌ 94.00 సగటుతో 188 పరుగులు చేశాడు.

‘గిల్‌లో ప్రత్యేక ప్రతిభ ఉంది. చాలా కాలం తర్వాత నేను ఇష్టంగా ఒక కుర్రాడి బ్యాటింగ్‌ చూస్తున్నాను. 2019 ప్రపంచ కప్‌ తర్వాత అతను భారత జట్టులోకి రావడం ఖాయం’... గిల్‌ పంజాబ్‌ సహచరుడు, భారత స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ వారం రోజుల క్రితమే చేసిన వ్యాఖ్య ఇది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో చాలా ముందుగా శుబ్‌మన్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. టీనేజర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చి ‘భవిష్యత్తు తార’గా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న భారత యువ ఆటగాళ్లలో శుబ్‌మన్‌ గిల్‌ కూడా ఒకడు. అండర్‌–16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో పంజాబ్‌ తరఫున మొదటి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న గిల్‌ వరుసగా రెండేళ్ల పాటు బీసీసీఐ ‘బెస్ట్‌ జూనియర్‌ క్రికెటర్‌’ అవార్డు అందుకున్నాడు.

ముఖ్యంగా కెరీర్‌ పరంగా అతనికి గత ఏడాది కాలం అద్భుతంగా సాగింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లోనే జరిగిన అండర్‌–19 ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలోనే 124 సగటుతో 372 పరుగులు చేసిన గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచి జట్టుకు టైటిల్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందే ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన అండర్‌–19 వన్డే సిరీస్‌లో కూడా 4 ఇన్నింగ్స్‌లలోనే 351 పరుగులు, ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి మరో 278 పరుగులు చేయడం గిల్‌పై అందరి దృష్టీ పడేలా చేసింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.1.8 కోట్లకు గిల్‌ను తీసుకుంది. అప్పటి నుంచి ఇక సీనియర్‌ విభాగంలో ఎలా రాణిస్తాడనే దానిపైనే ఆసక్తి నెలకొంది.

సాంప్రదాయ శైలిలో బ్యాటింగ్‌ చేస్తూనే ప్రతీ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటను మార్చుకొని అన్ని రకాల షాట్లు ఆడగలగడం గిల్‌ ప్రత్యేకత. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన శుబ్‌మన్‌ ప్రతీ మ్యాచ్‌లో కనీసం అర్ధ సెంచరీ చేయడం విశేషం. ముఖ్యంగా తమిళనాడుపై చేసిన 268 పరుగుల ఇన్నింగ్స్‌ అతని సాధికారితను చాటితే... హైదరాబాద్‌పై 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 154 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 148 పరుగులు అతని కెరీర్‌లో ఇప్పటివరకు అతి పెద్ద హైలైట్‌.

తుది జట్టులో అవకాశం లభిస్తే భారత్‌ సీనియర్‌ జట్టు తరఫున ఆడుతున్నాననే ఒత్తిడిని నేను ముందుగా అధిగమించాలి. ఇది కొంత కష్టమే కానీ నేను మానసికంగా సిద్ధంగా ఉన్నా. ఏడాది క్రితం అండర్‌–19 ప్రపంచకప్‌ ఆడాను. ఇటీవలే పర్యటించిన న్యూజిలాండ్‌ గడ్డపై తొలి సిరీస్‌కు ఎంపిక కావడం మంచిదే. అక్కడ బాగా రాణించాను కాబట్టి నా టెక్నిక్‌లో పెద్దగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. టీమిండియా చాన్స్‌ను అసలు ఊహించలేదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఎంపికయ్యానో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఆడిన అన్ని స్థాయిలలో రాణించాను కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా బాగా ఆడగలననే నమ్మకముంది. 
– శుబ్‌మన్‌ గిల్‌

మరిన్ని వార్తలు