పీబీఎల్ చాంప్ ఢిల్లీ ఏసర్స్

18 Jan, 2016 00:39 IST|Sakshi
పీబీఎల్ చాంప్ ఢిల్లీ ఏసర్స్

ఫైనల్లో ముంబై రాకెట్స్‌పై గెలుపు
 
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ ఏసర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో తాము ఎంచుకున్న ‘ట్రంప్ మ్యాచ్’ల్లో ఓడిపోని ఢిల్లీ ఏసర్స్ ఫైనల్లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించి విజయాన్ని దక్కించుకుంది.
 
 తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో అక్షయ్ దేవాల్కర్-గాబ్రియెలా అడ్‌కాక్ (ఢిల్లీ) ద్వయం 6-15, 12-15తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆ జట్టు 0-1తో వెనుకబడింది. అయితే రెండో మ్యాచ్‌గా జరిగిన తొలి పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో (ఢిల్లీ) 13-15, 15-9, 15-9తో హెచ్‌ఎస్ ప్రణయ్ (ముంబై)ను ఓడించాడు. ఫలితంగా స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా నిర్వహించిన పురుషుల డబుల్స్‌లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హెంగ్ (ఢిల్లీ) జోడీ 14-15, 15-10, 15-14తో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది.
 
 దాంతో ఢిల్లీ 2-1 పాయింట్లతో ముందంజ వేసింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్ పోటీని ముంబై రాకెట్స్ తమ ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హాన్ లీ (ముంబై) 12-15, 15-8, 15-8తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. ‘ట్రంప్ మ్యాచ్’ నెగ్గినందుకు ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. దాంతో ముంబై 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంపిక చేసుకుంది.
 
  ఈ మ్యాచ్‌లో రాజీవ్ ఉసెఫ్ 15-11, 15-6తో గురుసాయిదత్ (ముంబై)పై గెలుపొందాడు. దాంతో ఢిల్లీ ఏసర్స్ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. ఫలితంగా ఓవరాల్‌గా ఢిల్లీ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు కాసేపు రాకెట్స్ పట్టారు. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతో కలిసి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.

మరిన్ని వార్తలు