సిద్ధార్థ్‌ కౌల్‌ ‘హ్యాట్రిక్‌’

5 Feb, 2020 08:00 IST|Sakshi

తొలి రోజే 24 వికెట్లు 

ఆంధ్ర తడబాటు

తొలి ఇన్నింగ్స్‌లో 97 ఆలౌట్‌ 

రెండో ఇన్నింగ్స్‌లో 31/4

పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 108 ఆలౌట్‌  

పాటియాలా: ఇరు జట్ల బౌలర్లు హడలెత్తించడంతో... ఆంధ్ర, పంజాబ్‌ జట్ల మధ్య ఇక్కడి ధ్రువ్‌ పాండవ్‌ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో  తొలి రోజు ఏకంగా 24 వికెట్లు పడ్డాయి. తొలుత పంజాబ్‌ పేస్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ (5/24) హ్యాట్రిక్‌తో అదరగొట్టడం... వినయ్‌ చౌదరీ (3/28) కూడా రాణించడంతో... ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌ (0), ప్రశాంత్‌ (0)లు డకౌట్‌గా వెనుదిరగ్గా... ప్రణీత్‌ (5), కెపె్టన్‌ రికీ భుయ్‌ (23 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇలా వచ్చి అలా వెళ్లారు.

జట్టు టాప్‌ స్కోరర్‌గా బోడపాటి సుమంత్‌ (51 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలిచాడు. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లోని రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా శశికాంత్‌ (28 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), స్వరూప్‌ (0), ఆశిష్‌ (0)లను అవుట్‌ చేసిన పంజాబ్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అనంతరం ఆంధ్ర బౌలర్లు షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (5/46), ఆశిష్‌ (5/50) ధాటికి... పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 11 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 9.2 ఓవరల్లో 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర 20 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రికీ భుయ్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.  

>
మరిన్ని వార్తలు