ఆంధ్ర, త్రిపుర మ్యాచ్‌ ‘డ్రా’

13 Nov, 2017 04:46 IST|Sakshi

అగర్తల: ఆంధ్ర, త్రిపుర మధ్య హోరాహోరీగా సాగిన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’ సమరం చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం ఆంధ్ర జట్టు దూకుడుగా ఆడి సవాల్‌ విసరగా... ఆ తర్వాత త్రిపుర కూడా లక్ష్య ఛేదనలో వెనకడుగు వేయలేదు. చివరకు వెలుతురులేమితో మ్యాచ్‌కు ముగింపు లభించింది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి త్రిపుర 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మిత్‌ పటేల్‌ (99 బంతుల్లో 107 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి సెంచరీ చేయగా, ఉత్తమ్‌ బోస్‌ (46 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భార్గవ్‌ భట్‌కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 51/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 234 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. శ్రీకర్‌ భరత్‌ (50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, అశ్విన్‌ హెబర్‌ (32 బంతుల్లో 44 నాటౌట్‌; 3 సిక్స్‌లు), సుమంత్‌ (42 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు), రికీ భుయ్‌ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. ఆంధ్ర 5.08 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత 18 పాయింట్లతో ఆంధ్ర ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర, ముంబైతో తలపడుతుంది. ఈ నెల 17 నుంచి సొంతగడ్డపై ఒంగోలులో జరిగే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధిస్తే చాలు ఆంధ్ర క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు