ఐసీసీ నిషేధంపై స్పందించిన సికందర్‌

19 Jul, 2019 12:31 IST|Sakshi

హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది.

ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్‌ రజా, బ్రెండన్‌ టైలర్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్‌ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్‌ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.
 

‘జింబాబ్వేను సస్పెండ్‌ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్‌ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్‌ స్టాఫ్‌ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్‌కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్‌ టేలర్‌ ట్వీట్‌ చేశారు.
 

>
మరిన్ని వార్తలు