అపూర్వి విజయం చిన్నారి సొంతం

17 Nov, 2018 10:40 IST|Sakshi
గ్రీస్‌లో జరిగిన పోటీల్లో పతకం అందుకుంటున్న పూర్వీశర్మ

హైదరాబాద్‌ కరాటే కిడ్‌ పూర్వీశర్మ

కరాటే పోటీల్లో ప్రతిభ చాటుతున్న బాలిక  

ఏథెన్స్‌ అంతర్జాతీయ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌

కుత్బుల్లాపూర్‌: చిన్న వయసులోనే కరాటేలో పట్టు సాధించింది. మూడేళ్లు శిక్షణలో ఆ క్రీడలో రాటుదేలిందా చిన్నారి. పేరు పూర్వీశర్మ.. ఫతేనగర్‌కు చెందిన సంజయ్‌శర్మ, అమితాశర్మల చిన్న కుమార్తె. సెయింట్‌ పీటర్‌ (బోయిన్‌పల్లి) గ్రామర్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతోంది. పూర్వీ.. తెలంగాణ ప్రాంతం నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించి గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరంలో గతనెల 25 నుంచి జరిగిన కరాటే ‘షుటికై’ టోర్నమెంట్‌లో తనదైన శైలిలో రాణించి సిల్వర్‌ మెడ ల్‌ సాధించింది. ఒకినావా మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీలో మహ్మద్‌ మన్సూర్‌ పాషా శిక్షణతో కెరీర్‌ ప్రారంభించింది. గ్రీస్‌లో జరిగిన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది చిన్నారులను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో పూర్వీశర్మ అతి చిన్న వయస్కురాలు కావడం విశేషం.  

ఆది నుంచి ప్రతిభావనిగా..  
పూర్వీశర్మ 2015లో శిక్షణ ప్రారంభించి అదే ఎడాది మండల, జిల్లా స్థాయి పోటీల్లో తొలి విజయం సాధించింది. 2016లో ఇంటర్‌ స్టేట్, స్కూల్‌ లెవల్‌ పోటీల్లోనూ విజయం సొంతం చేసుకుంది.  2017లో మహాబలేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నా అండర్‌–10 కేటగిరీలో తన ప్రతిభను చాటి ఔరా అనిపించింది. ఈ ఏడాది గ్రీస్‌ అంతర్జాతీయ పోటీల కోసం జరిగిన ఎంపికలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో అత్యంత కఠినమైన వడపోతలో మేటిగా నిలిచింది పూర్వీశర్మ. ఎంపిక కమిటీ అంచనాలను నిజం చేస్తూ తాజాగా గ్రీస్‌లో సిల్వర్‌ పతకం సాధించి ‘హైదరాబాద్‌ కరాటే కిడ్‌’గా నిలిచింది.

చివరి నిమిషంలో చేతులెత్తేసిన స్పాన్సర్‌  
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వస్తున్న పూర్వీశర్మకు తొలుత ఓ స్పాన్సర్‌ ముందుకు వచ్చి హడావిడి చేశాడు. ఇది నమ్మిన ఆమె తల్లిదండ్రులు సంజయ్‌ శర్మ, అమితా శర్మలు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇంకో వారం రోజులలో గ్రీస్‌కు వెళ్లేక్రమంలో అంతవరకు స్పాన్సర్‌గా ఉంటానన్న వ్యక్తి చెతులెత్తేశాడు. దీంతో గత్యంతరం లేక బ్యాంక్‌లో రూ.5 లక్షలు లోన్‌ తీసుని చిన్నారిని పోటీలకు పంపించారు. ఇప్పుడు కుమార్తె సిల్వర్‌ మెడల్‌ సంపాదించడంతో తమ కష్టానికి ఫలితం దక్కిందని ఆమె తల్లిదండ్రులు ‘సాక్షి’తో చెప్పారు. ప్రతిభ గల చిన్నారులకు ప్రభుత్వం చేయుతనందించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు