అప్పుడు వేటు.. ఇప్పుడు అందలం!

15 Oct, 2019 12:47 IST|Sakshi

ఆంటిగ్వా:  ఇటీవల భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసి భంగపడ్డ ఫిల్‌ సిమ్మన్స్‌ మళ్లీ సొంత గూటికే చేరారు. మరోసారి వెస్టిండీస్‌ ప‍్రధాన కోచ్‌గా సిమన్స్‌ నియమించబడ్డారు. దాదాపు మూడేళ్ల క్రితం సిమ్మన్స్‌ ఉన్నపళంగా తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు.. తన తప్పును తెలుసుకుంది. 2016 టీ20 వరల్డ్‌కప్‌ను వెస్టిండీస్‌ సాధించడంలో కోచ్‌గా తన వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించిన సిమ్మన్స్‌.. ఆపై వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వేటు కారణంగా ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే బోర్డు సిమ్మన్స్‌ను మరోసారి అందలం ఎక్కించింది. నాలుగేళ్ల కాలానికి ప్రధాన కోచ్‌ బాధ్యతలు అప్పచెబుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్‌ క్రికెట్‌కు దూరమైన తర్వాత అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా, అటు తర్వాత కోచ్‌గా కూడా సిమ్మన్స్‌ సేవలందించారు.

వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ పేలవ ప్రదర్శన కారణంగా సిమ్మన్స్‌ పదవిని పొడిగించడానికి ఆ దేశ క్రికెట్‌ బోర్డు మొగ్గుచూపలేదు. ఈ నేపథ్యంలో పలు క్రికెట్‌ బోర్డులు కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన క్రమంలో వాటికి దరఖాస్తు చేసుకుంటూనే వచ్చాడు సిమ్మన్స్‌. అయితే మళ్లీ విండీస్‌కే ప్రధాన కోచ్‌గా పదవే సిమ్మిన్స్‌ను వరించింది.సిమ్మన్స్‌ను ప్రధాన కోచ్‌ నియమించడంపై క్రికెట్‌ వెస్టిండీస్‌ అధ్యక్షుడు రికీ స్కరిట్‌ మాట్లాడుతూ.. ‘ సిమ్మన్స్‌ను తిరిగి కోచ్‌గా నియమించడం తాము చేసిన తప్పును సరిద్దిద్దుకోవడమే కాదు.. అతనిపై ఉన్న నమ్మకంతోనే మళ్లీ విండీస్‌ క్రికెట్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పాం. మా క్రికెట్‌ బోర్డు తగిన వ్యక్తినే తగిన సమయంలో నియమించింది’ అని పేర్కొన్నారు.

56 ఏళ్ల సిమ్మన్స్‌ కు 2016 సెప్టెంబర్‌లో స్వస్తి చెప్పింది విండీస్‌ బోర్డు. క్రికెటర్ల జీత భత్యాల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో బోర్డుతో సిమ్మన్స్‌కు అభిప్రాయ భేదాలు రావడంతో అతన్ని అర్థాంతరంగా తొలగించారు. కాగా, వచ్చే ఏడాది వరల్డ్‌ టీ20 జరుగనున్న తరుణంలో సిమ్మన్స్‌కు మరొకసారి పెద్ద పీట వేశారు. ఈ ఫార్మాట్‌లో విజయవంతమైన సిమ్మన్స్‌ మళ్లీ జట్టును గాడిలో పెడతాడని భావించి ప్రధాన కోచ్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు