రష్యా భామకు మళ్లీ చుక్కెదురు!

4 Oct, 2017 17:34 IST|Sakshi
సిమోనా హలెప్ (ఫైల్ ఫొటో)

బీజింగ్: చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట పడుతున్న షరపోవా.. తాజాగా చైనా ఓపెన్ మూడో రౌండ్లో ఓటమి పాలైంది. రొమేనియా భామ, వరల్డ్ నెంబర్ 2 సిమోనా హలెప్ చేతిలో 6-2, 6-2తో రెండు వరుస సెట్లు కోల్పోయిన షరపోవా చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. వరుస సెట్లలో షరపోవాకు ముచ్చెమటలు పట్టించిన హలెప్ ఈ విజయంతో గతంలో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది.

డోపింగ్ నిషేధం తర్వాత గత ఏప్రిల్ లో మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన రష్యన్ టెన్సిస్ క్వీన్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బీజింగ్ లోని హార్డుకోర్టులోనూ రాణించలేకపోవడంతో హలెప్ చేతిలో చిత్తయింది. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో నాలుగో రౌండ్‌లో లాత్వియాకు చెందిన అనస్తాసిజా సెవస్తోవా చేతిలో 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓటమిపాలైంది.

మునుపటిలా గ్రాండ్ స్లామ్ లు, భారీ టోర్నీలు నెగ్గాలంటే షరపోవా అంతకుమించి శ్రమించాల్సి ఉంటుందని టెన్నిస్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ ముగురుజా టోర్నీ నుంచి ఇదివరకే తప్పుకోవడంతో, చైనా ఓపెన్ లో హలెప్ అవకాశాలు మెరుగయ్యాయి.

మరిన్ని వార్తలు