అనిసిమోవా సంచలనం

7 Jun, 2019 04:46 IST|Sakshi
అమండ అనిసిమోవా,సిమోనా హలెప్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ హలెప్‌పై విజయం

సెమీస్‌లో యాష్లే బార్టీతో ‘ఢీ’

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్‌ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్‌ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్‌ వైదిసోవా (చెక్‌ రిపబ్లిక్‌–2007 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.

1990లో జెన్నిఫర్‌ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్‌ విలియమ్స్‌ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో జొహనా కొంటా (బ్రిటన్‌) తలపడతారు.  

సెమీస్‌లో జొకోవిచ్, థీమ్‌
పురుషుల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై, నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌); జొకోవిచ్‌తో థీమ్‌ ఆడతారు.   
 

మరిన్ని వార్తలు