భళారే... బైల్స్‌

14 Oct, 2019 02:41 IST|Sakshi

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా సిమోన్‌ బైల్స్‌ ప్రపంచ రికార్డు

25వ పతకంతో షెర్బో రికార్డును బద్దలు కొట్టిన అమెరికా జిమ్నాస్ట్‌

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): ఊహించిన అద్భుతమే జరిగింది. అమెరికా మెరుపుతీగ సిమోన్‌ బైల్స్‌ ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా 22 ఏళ్ల బైల్స్‌ రికార్డు నెలకొలిపంది. ఆదివారం ముగిసిన ప్రపంచ ఆరి్టస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు బైల్స్‌ బ్యాలెన్సింగ్‌ బీమ్‌ (15.066 పాయింట్లు), ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ (15.133 పాయింట్లు) ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.

దాంతో ఇప్పటివరకు బెలారస్‌ పురుష జిమ్నాస్ట్‌ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న రికార్డును బైల్స్‌ 25వ పతకంతో బద్దలు కొట్టింది. శనివారం షెర్బో రికార్డును సమం చేసిన బైల్స్‌ ఆదివారం మరో రెండు స్వర్ణాలు గెలిచి తనకు ఎదురులేదని చాటుకుంది. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో బైల్స్‌కిది ఐదో పసిడి పతకం. ఐదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన బైల్స్‌ ఈ ఈవెంట్‌ చరిత్రలో 19 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు సాధించింది. తనకిదే చివరి ప్రపంచ చాంపియన్‌షిప్‌ కావొచ్చని... వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత కెరీర్‌కు కూడా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నానని బైల్స్‌ తెలిపింది.   

మరిన్ని వార్తలు