నిరీక్షణ ముగిసేనా?

6 Mar, 2019 02:15 IST|Sakshi

నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

ఆశల పల్లకిలో సింధు,సైనా, శ్రీకాంత్‌

బరిలో సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, ప్రణయ్‌

బర్మింగ్‌హమ్‌: బ్యాడ్మింటన్‌లోని అతి పురాతన టోర్నమెంట్‌లలో ఒకటైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారులకు టైటిల్‌ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది పీవీ సింధు పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అయితే కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే... ఈసారి కూడా మనోళ్లు టైటిల్‌ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి.

మాజీ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) ఫామ్‌లో లేకపోవడం.. జపాన్‌ క్రీడాకారిణులు నొజోమి ఒకుహారా, అకానె యామగుచిలపై మంచి రికార్డు ఉండటంతో... సింధు, సైనాలు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే వారికి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో పదో ర్యాంకర్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా)తో ఐదో ర్యాంకర్‌ పీవీ సింధు... కిర్‌స్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 8–6తో సుంగ్‌ జీ హున్‌పై... సైనా 6–0తో గిల్మోర్‌పై ఆధిక్యంలో ఉన్నారు. 

పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి అత్యధికంగా నలుగురు బరిలో ఉన్నారు. మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్‌లో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌)తో శ్రీకాంత్‌; ప్రణయ్‌తో సాయిప్రణీత్‌; అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో సమీర్‌ వర్మ పోటీపడనున్నారు.  పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఒయు జువాని–రెన్‌ జియాంగ్‌యు (చైనా) జోడీతో సుమీత్‌ రెడ్డి–మను అత్రి జంట... మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో షిమో తనాకా–కొహారు యోనెమోటో (జపాన్‌) ద్వయంతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ తలపడతాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో చాంగ్‌ తక్‌ చింగ్‌–ఎన్జీ వింగ్‌ యుంగ్‌ (హాంకాంగ్‌)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ఆడతారు. 

>
మరిన్ని వార్తలు