సింధు, సైనాలకు ‘బై’

6 Aug, 2019 09:27 IST|Sakshi

నేరుగా రెండో రౌండ్‌లో ఆడనున్న భారత స్టార్స్‌

 ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ‘డ్రా’ విడుదల

 ఈనెల 19 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లో మెగా ఈవెంట్‌

కౌలాలంపూర్‌ (మలేసియా): అందని ద్రాక్షగా ఉన్న స్వర్ణ పతకమే లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్న భారత మహిళా స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు ఒకింత క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 19 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ నగరంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి సోమవారం కౌలాలంపూర్‌లో ‘డ్రా’ విడుదల చేశారు. ఈ ఏడాది అంతగా ఫామ్‌లో లేని సింధు ఐదో సీడ్‌గా, సైనా ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. సింధు, సైనాలతోపాటు సీడింగ్‌ పొందిన 16 మంది క్రీడాకారిణులకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించడంతో వారందరూ నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. పై పార్శ్వంలో ఉన్న సైనాకు రెండో రౌండ్‌లో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌), ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 11వ సీడ్‌ మిచెల్లి లీ (కెనడా) లేదా ఫిత్రియాని (ఇండోనేసియా)లలో ఒకరు ఎదురుకావొచ్చు. ఈ అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ చెన్‌ యు ఫె (చైనా) లేదా తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)లలో ఒకరితో సైనా ఆడే అవకాశముంటుంది. సైనా సెమీస్‌ చేరితే అక్కడ ప్రపంచ నంబర్‌వన్‌ అకానె యామగుచి (జపాన్‌) లేదా ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉంటారు. కింది పార్శ్వంలో ఉన్న సింధు తన స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్‌ ఫైనల్‌కు సులువుగా చేరుకోవచ్చు. క్వార్టర్‌ ఫైనల్లోనే సింధుకు మాజీ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) రూపంలో అసలు పరీక్ష ఎదురయ్యే చాన్స్‌ ఉంది. ఈ అవరోధాన్ని అధిగమిస్తే సింధుకు సెమీస్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఒకుహారా (జపాన్‌) లేదా ఆరో సీడ్‌ హి బింగ్‌జియావో (చైనా)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. 

శ్రీకాంత్‌కు సదవకాశం: పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున నలుగురు ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఏడో సీడ్‌గా కిడాంబి శ్రీకాంత్, పదో సీడ్‌గా సమీర్‌ వర్మ, 16వ సీడ్‌గా సాయిప్రణీత్, అన్‌సీడెడ్‌గా ప్రణయ్‌ బరిలో ఉన్నారు. శ్రీకాంత్‌ సహజశైలిలో ఆడితే  క్వార్టర్‌ ఫైనల్‌ చేరే చాన్స్‌ ఉంది. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఉంటాడు.  
మారిన్‌ దూరం: మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) గాయం కారణంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ విశ్వవిజేత అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) కూడా తప్పుకున్నారు.

>
మరిన్ని వార్తలు