క్వార్టర్స్‌లో సింధు, సైనా

10 Jan, 2020 01:07 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లో ఓడిన ప్రణయ్, సమీర్‌ వర్మ

మలేసియా మాస్టర్స్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: ఈ ఏడాది ఆరంభ బ్యాడ్మింటన్‌ టోర్నీ అయిన మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించగా... పురుషుల విభాగంలో మాత్రం హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మలకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మహిళల ప్రిక్వార్టర్స్‌ పోరులో పీవీ సింధు 21–10, 21–15తో అయా ఒహోరి (జపాన్‌)పై గెలుపొందింది. ఆయా ఓహోరిపై సింధుకిది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 25–23, 21–12తో టోర్నీ ఎనిమిదో సీడ్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.

తొలి గేమ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా... కీలక సమయంలో పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో ఆన్‌ సె యంగ్‌ చేతిలో ఎదురైన ఓటమికి సైనా ప్రతీకారం తీర్చుకున్నట్లంది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు; మాజీ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడతారు. పురుషుల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సమీర్‌ వర్మ 19–21, 20–22తో లీ జి జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్‌ 14–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటి ముఖం పట్టారు.

>
మరిన్ని వార్తలు