ఈ ‘విజయం’ అమ్మకు అంకితం..

25 Aug, 2019 19:31 IST|Sakshi

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌) : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్‌ ఫోర్‌ నొజోమి ఒకుహార (జపాన్‌)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్‌ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది. బాసెల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఈ అవార్డును తన తల్లి బర్త్‌డే సందర్భంగా ఆమెకి అంకితం చేస్తున్నానని, హ్యాపీ బర్త్‌డే మామ్‌ అంటూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించింది.

పీవీ సింధూ కోర్టు నుంచి బయటకు నడచివస్తుండగా ప్రేక్షకులు పెద్దపెట్టున హ్యాపీ బర్త్‌డే అంటూ ఆమె తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2017, 2018లో సింధూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ఫైనల్‌కు వచ్చినా కీలక మ్యాచ్‌ల్లో ఓటమితో రెండోస్ధానంతో సింధూ సరిపెట్టుకున్నారు. మూడోసారి ఫైనల్‌ ఫోబియాను అధిగమించి సింధూ సత్తా చాటడంతో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశం కోసం తాను ఈ విజయాన్ని ముద్దాడానని సింధూ సగర్వంగా చాటారు. కాగా తన కుమార్తె సాధించిన చారిత్రక విజయం తమకు గర్వకారణమని సింధూ తల్లి విజయ తన సంతోషం పంచుకున్నారు.

సింధుకు నా అభినందనలు: విజయ
సింధు విజయం పట్ల ఆమె తల్లి హర్షం వ్యక్తం చేశారు. సింధు ప్రపంచస్థాయి గుర్తింపు సాధించినందుకు గర‍్వకారణంగా ఉందని అన్నారు. ‘నా బిడ్డ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పుట్టినరోజునే సింధు ఇంతటి విజయం సాధించడం... నాకు లభించిన పెద్ద బహుమతి’ అని విజయ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా