సింధుపైనే దృష్టి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీ

8 Mar, 2017 01:56 IST|Sakshi
సింధుపైనే దృష్టి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీ

బర్మింగ్‌హామ్‌: గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజతం... చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ టైటిల్‌... సూపర్‌ సిరీస్‌ మాస్టర్స్‌ ఫైనల్స్‌లో రన్నరప్‌... ఈ సంవత్సరం సయ్యద్‌ మోది గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌... కొంతకాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో విజయంపై దృష్టి పెట్టింది. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగుతోంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ మెట్టీ పుల్సెన్‌ (డెన్మార్క్‌)తో సింధు తలపడనుంది. గతంలో ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో నాలుగుసార్లు పోటీపడ్డ సింధు మూడుసార్లు తొలి రౌండ్‌లో, ఒకసారి రెండో రౌండ్‌లోనే ఓడిపోయింది.

అయితే ఈసారి గత ప్రదర్శనకంటే ఎంతో మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో ఈ హైదరాబాద్‌ అమ్మాయి ఉంది. మరోవైపు సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో ఆడనుంది. ‘డ్రా’లో సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉండటంతో క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమిస్తే వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడతారు.  మంగళవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో సౌరభ్‌ వర్మ, సమీర్‌ వర్మ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.

మరిన్ని వార్తలు