రన్నరప్తో సింధు సరి

27 Nov, 2016 12:33 IST|Sakshi
రన్నరప్తో సింధు సరి

కౌలూన్: గతవారం చైనా ఓపెన్  సూపర్ సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుకు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో మాత్రం నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ సింధు 15-21, 17-21 తేడాతో మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్గా సరిపెట్టుకుంది.  తొలి గేమ్లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్లో కూడా ఆకట్టుకోలేకపోయింది.  తొలి గేమ్లో 6-3 ముందంజ వేసిన సింధు.. ఆ తరువాత వరుసగా ఆరుపాయింట్లను కోల్పోయింది. దాంతో గేమ్పై పట్టు సాధించిన తై జు యింగ్ మరింత ముందుకు దూసుకుపోయింది. కాగా,  సింధు 11-18తో వెనుకబడిన దశలో  వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ గేమ్ను రక్షించుకోలేపోయింది.


ఇక రెండో గేమ్లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. దాదాపు 10 పాయింట్ల వరకూ నువ్వా-నేనా అన్నట్లు పోరు కొనసాగింది. అయితే ఆ తరువాత అనవసర తప్పిదాలతో సింధు పలు పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ చివర్లో సింధు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో తై జు యింగ్ కచ్చితమైన ప్రణాళికలతో ఆకట్టుకుని సింధును నిలువరించింది. ఇది తై జు యింగ్ కెరీర్లో రెండో హాంకాంగ్ ఓపెన్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2014లో తొలిసారి ఈ టైటిల్ను తై జు సాధించింది.

మరిన్ని వార్తలు