సింధుకు ఉజ్వల భవిష్యత్

11 Aug, 2013 00:54 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం
 సైనా తర్వాత ఎవరు? అన్న ప్రశ్నకు సింధు రూపంలో సమాధానం దొరికింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగుతేజం ప్రదర్శన చూశాక భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందనే నమ్మకం కలిగింది. ఇన్నాళ్లూ భారత బ్యాడ్మింటన్ అంటే ప్రధానంగా సైనా పేరును ప్రస్తావించేవారు. ఇక నుంచి ఈ ఇద్దరి పేర్లూ వినిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకంతో సింధు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పదేళ్ల కఠోర శ్రమకు ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒక్క ఘనతతో సింధును అగ్రశ్రేణి క్రీడాకారిణుల జాబితాలో చేర్చడం తొందరపాటే అవుతుంది.
 
  5 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఇంకా రాటుదేలాల్సి ఉంది. స్టార్‌గా ఎదగాలంటే సింధు ఆటతీరు మెరుగుపడాల్సిన అవసరముందని రత్చనోక్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌తో రుజువైంది. దూకుడుగా ఆడే చైనీయుల ఆటతీరుకు సింధు శైలి సరిపోతుంది. కానీ ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసి సందర్భాన్నిబట్టి ఆడే రత్చనోక్‌లాంటి క్రీడాకారిణులను ఓడించాలంటే ఫిట్‌నెస్... షాట్‌లలో వైవిధ్యం... మానసిక దృఢత్వం... ఇలా పలు అంశాల్లో రాటుదేలాల్సిన అవసరం ఉంది.
 
 గత ఏప్రిల్‌లో మోకాలి గాయం కారణంగా రెండు నెలలపాటు సింధు ఆటకు దూరమైంది. సింధు ఇంకా నేర్చుకునేదశలోనే ఉందని ఆమె పరిపూర్ణ క్రీడాకారిణిగా మారాలంటే మరో రెండేళ్లు పడుతుందని ఇటీవల చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే... సహజశైలిలో ఆడితే... ఎలాంటి ఫలితాలు వస్తాయో తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనిపించింది. ఒకట్రెండు విజయాలతో ఉప్పొంగిపోకుండా తన కెరీర్ మరింత ఉజ్వలంగా మారాలంటే సింధు ఆటతీరులో స్థిరత్వం కనిపించాలి. అప్పుడే మరిన్ని విజయాలు వస్తాయి.
 

మరిన్ని వార్తలు