భారత్‌కు పతకాల పంట

22 Dec, 2015 02:11 IST|Sakshi

కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్
సూరత్: సొంతగడ్డపై భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ టీటీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 15 పతకాలను సొంతం చేసుకొని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో భారత్ అత్యుత్తమంగా తొమ్మిది పతకాలు సాధించింది. సోమవారం ముగిసిన ఈ ఈవెంట్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి.

పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్ విభాగంలో మౌమా దాస్ రన్నరప్‌లుగా నిలిచి రజత పతకాలను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్ 5-11, 5-11, 11-9, 11-6, 12-14, 7-11తో చెన్ ఫెంగ్ (సింగపూర్) చేతిలో; మౌమా దాస్ 7-11, 5-11, 11-7, 2-11, 3-11తో జౌ యిహాన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు.

పురుషుల డబుల్స్ విభాగంలో సౌమ్యజిత్ ఘోష్-హర్మీత్ దేశాయ్ (భారత్) జంట 5-11, 11-8, 10-12, 11-9, 11-3తో సత్యన్-దేవేశ్ (భారత్) జోడీపై నెగ్గి స్వర్ణం దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో మణిక బాత్రా-అంకిత దాస్ (భారత్) జంట 6-11, 9-11, 9-11తో లిన్ యె-జౌ యిహాన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు