శ్రీకాంత్ సత్తాకు సవాల్

12 Apr, 2016 01:14 IST|Sakshi
శ్రీకాంత్ సత్తాకు సవాల్

వైదొలిగిన సైనా నెహ్వాల్  
బరిలో సింధు, ప్రణయ్, జయరామ్  
నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ

 
 
సింగపూర్:
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మరో మూడు వారాల సమయం... మరో మూడు టోర్నీలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత స్టార్ సైనా నెహ్వాల్ మినహా... మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.


గత రెండు సూపర్ సిరీస్ టోర్నీలు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌లలో తొలి రౌండ్‌లోనే ఓడిన ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు సింగపూర్ ఓపెన్‌లోనూ క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నెగ్గితే రెండో రౌండ్‌లో ఆరో సీడ్ తియాన్ హువీ (చైనా) లేదా టకుమా ఉయెదా (జపాన్)లతో ఆడాల్సి ఉంటుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్; మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో అజయ్ జయరామ్ ఆడతారు. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో జుల్ఫాది జుల్కిఫి (మలేసియా)తో గురుసాయిదత్; హెన్రికో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ ఆడతారు.

గతవారం ముగిసిన మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిన సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి కూడా ఎంట్రీని పంపించింది. తొలి రౌండ్‌లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా ఆడాల్సింది. అయితే చివరి నిమిషంలో సైనా వైదొలగడంతో ఆమె స్థానాన్ని ఆయా ఓరి (జపాన్)తో భర్తీ చేశారు. సైనా వైదొలగడంతో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. బుసానన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో సింధు గెలిస్తే రెండో రౌండ్‌లో ఏడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా హీ బింగ్‌జియావో (చైనా)లతో ఆడుతుంది.

>
మరిన్ని వార్తలు