15 ఓవర్లు.. 9 మెయిడిన్లు.. 4 వికెట్లు

7 Oct, 2016 10:42 IST|Sakshi
15 ఓవర్లు.. 9 మెయిడిన్లు.. 4 వికెట్లు

నాగ్‌పూర్: 15 ఓవర్లలో 9 మెయిడిన్లు...కేవలం 14 పరుగులు, 4 వికెట్లు... కెరీర్‌లో రెండో రంజీ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ గణాంకాలివి. అతని బౌలింగ్ ప్రదర్శనకు తోడు రవికిరణ్, విశాల్ శర్మ చెరో 2 వికెట్లు తీయడంతో రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌లో హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. గురువారం హైదరాబాద్‌తో ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ’సి’ మ్యాచ్‌లో గోవా తమ తొలి ఇన్నింగ్‌‌సలో 74 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. సౌరభ్ బందేకర్ (144 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, స్నేహల్ కౌతాంకర్ (140 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

అనంతరం హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో తన్మయ్ అగర్వాల్ (10) వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో అక్షత్ రెడ్డి (18), విశాల్ శర్మ (0) ఉన్నారు. టాస్ గెలిచిన గోవా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రవికిరణ్ వరుస ఓవర్లలో అమోఘ్ దేశాయ్ (10), కెప్టెన్ షగున్ కామత్ (0)లను అవుట్ చేసి గోవాను దెబ్బ తీశాడు. ఆ తర్వాత మిసాల్ (1), అస్నోడ్కర్ (15), కీనన్ వాజ్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో గోవా స్కోరు 30/5గా నిలిచింది. ఈ దశలో కౌతాంకర్, బందేకర్ కలిసి గోవాను ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో ఆడిన వీరిద్దరు ఆరో వికెట్‌కు 80 పరుగులు జోడించారు.

మరిన్ని వార్తలు