మెయిన్‌ ‘డ్రా’కు సిరిల్‌  

21 Nov, 2018 01:34 IST|Sakshi

లక్నో: సయ్యద్‌ మోదీ స్మారక వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ పురుషుల సింగిల్స్‌లో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో సిరిల్‌ వర్మ 24–22, 21–18తో చిరాగ్‌ సేన్‌ (భారత్‌)పై, 21–16, 21–13తో కెవిన్‌ అల్టర్‌ (భారత్‌)పై విజయం సాధించాడు. సిరిల్‌తోపాటు భారత్‌కే చెందిన హర్షీల్‌ డాని కూడా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి మామిళ్లపల్లి తనిష్క్‌తోపాటు రితిక, శ్రుతి ముందాడ, అమోలిక సింగ్‌ సిసోడియా కూడా మెయిన్‌ ‘డ్రా’కు చేరుకున్నారు.
 
బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)తో చుక్కా సాయి ఉత్తేజిత రావు; రసిక రాజేతో తనిష్క్‌; యిమాన్‌ జాంగ్‌ (చైనా)తో గుమ్మడి వృశాలి; ప్రాషి జోషితో శ్రీకృష్ణప్రియ; శ్రుతితో ఐరా శర్మ; కేట్‌ ఫూ కునె (మారిషస్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడతారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ (భారత్‌)తో సిరిల్‌ వర్మ; తనోంగ్‌సక్‌ సెన్‌సోమ్‌బున్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)తో పారుపల్లి కశ్యప్‌; మిలాన్‌ లుడిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో రాహుల్‌ యాదవ్‌; సెర్గీ సిరాంట్‌ (రష్యా)తో సాయిప్రణీత్‌;  పెర్సన్‌ (జర్మనీ)తో గురుసాయిదత్‌ ఆడతారు.    

మరిన్ని వార్తలు