శివ, సుమీత్‌... రజతాలతో సరి!

7 May, 2017 00:15 IST|Sakshi
శివ, సుమీత్‌... రజతాలతో సరి!

ఫైనల్లో ఓడిన భారత బాక్సర్లు
ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌


తాష్కెంట్‌ (ఉజ్బెకిస్తాన్‌): పసిడి పతకాలు సాధించాలని ఆశించిన భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్‌ సాంగ్వాన్‌లకు నిరాశ ఎదురైంది. ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్‌ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్‌ సాంగ్వాన్‌ (91 కేజీలు) 0–5తో టాప్‌ సీడ్‌ వాసిలీ లెవిట్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్‌లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం కావడం విశేషం.

2013లో స్వర్ణం నెగ్గిన శివ... 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. ఎల్నూర్‌ అబ్దురైమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన ఫైనల్లో మూడు నిమిషాల నిడివిగల తొలి రౌండ్‌ చివరి సెకన్లలో శివ కుడి కంటి పైభాగానికి గాయం అయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి అబ్దురైమోవ్‌ను విజేతగా ప్రకటించారు. ‘నా రెండు లక్ష్యాలు పూర్తయ్యాయి. పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ను దక్కించుకున్నాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు.

మరోవైపు గౌరవ్‌ బిధురి (56 కేజీలు), మనీశ్‌ పన్వర్‌ (81 కేజీలు) ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ‘బాక్స్‌ ఆఫ్‌’ బౌట్‌లలో రైమీ తనకా (జపాన్‌) చేతిలో గౌరవ్‌... అవైజ్‌ అలీఖాన్‌ (పాకిస్తాన్‌) చేతిలో మనీశ్‌ ఓడిపోయారు. ఈ టోర్నమెంట్‌లోని ఆయా కేటగిరీలలో టాప్‌–6లో నిలిచిన బాక్సర్లు ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), అమిత్‌ ఫంగల్‌ (49 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. 

మరిన్ని వార్తలు